(సమీక్ష ప్రత్యేక కథనం)
లిక్కర్ సిండికేట్ దందా.. వైన్ షాపుల వ్యాపారులు సిండికేట్ అయ్యారని, లిక్కర్ రేట్లు అడ్డగోలుగా పెంచి తమను దోపిడీ చేస్తున్నారని మద్యపాన ప్రియులు గగ్గోలు పెట్టినా, సిండికేట్ దందా ద్వారా దోపిడీపై పత్రికలు వార్తలు రాసినా ఎక్సైజ్ అధికారులు పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా మీడియా ప్రతినిధులు ఎక్సైజ్ అధికారులను ఇదే అంశంపై గట్టిగా వివరణ కోరితే.. ‘లిక్కర్ వ్యాపారులు సిండికేట్ అయినట్లు మా దృష్టికి రాలేదండీ..! ప్రజలు కూడా మాకేమీ లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదండీ..!!’ అని చెబతుంటారు. అసలు వైన్ షాపుల ఓనర్లు సిండికేట్ అయినట్లు ఆధారాలే లేవని కూడా వాదిస్తుంటారు.
సరే ఈ అంశంలో ఎక్సైజ్ అధికారులు అలా వాదించడానికి కారణాలపై ప్రజల్లో సహజమైన అభిప్రాయాలే ఉంటాయనేది వేరే విషయం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో వెలుగులోకి వచ్చిన ‘సిండికేట్ దందా’లో ఆశ్చర్యకరమైన అంశాలు బట్టబయలు కావడం అత్యంత ఆసక్తికరం. సాధారణంగా లిక్కర్ వ్యాపారుల సిండికేట్ దందాకు పెద్దగా ఆధారాలు ఉండవు. నోటీమాటపైనే ఈ దందా చాలా చోట్ల జరుగుతుంటుంది. లెక్కలకు సంబంధించి రాసుకున్న కాగితాలు ఏనెలకానెల చిరిగిపోతుంటాయి. కానీ ‘సిండికేట్ గణేష్’గా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన కొండపల్లి గణేష్ అనే ఇల్లెందు గోల్డ్ మ్యాన్ లిక్కర్ దందాను అతని భాగస్వాములే బహిర్గతం చేశారు.

తమకు గణేష్ అన్యాయం చేశాడని, పెట్టుబడుల పేరుతో వంచించాడని, లాభాలు పంచడం లేదని అతనితో ‘సిండికేట్’ అయిన లిక్కర్ వ్యాపారులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. ‘గణేష్ వైన్స్’కు తాళాలు బిగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. మా సమస్యను జనంలోకి తీసుకువెళ్లాలని మీడియాను అభ్యర్థిస్తున్నారు. ఇదంతా వేరే విషయం. కానీ దిగువన గల రూ. 100 స్టాంప్ పేపర్ లోని ఒప్పందాన్ని ఓసారి నిశితంగా పరిశీలించండి. లిక్కర్ సిండికేట్ హోల్డర్స్ కలిసి నిర్వహిస్తున్న వ్యాపారంలో లాభాలను ఎలా పంచుకోవాలి? ఇందుకు చేసుకున్న ఒప్పందంలోని నియమాలేమిటి? తదితర అంశాలను ఈ బాండ్ పేపర్ లో క్లియర్ గా రాసుకున్నారు.

ఇంతకీ సిండికేట్ దందా వల్ల ప్రజలకు జరిగే నష్టం ఏమిటంటే..? లిక్కర్ వ్యాపారుల ఇష్టారాజ్యమే ‘సిండికేట్’ దందాకు పర్యాయ పదం. అడ్డగోలుగా రేట్లు పెంచుకోవచ్చు.. అడిగేవాడే ఉండడు. ఖరీదైన ఏ స్కాచ్ బాటిల్ లోనో, విదేశీ బ్రాండ్ సీసాలోనో చీప్ లిక్కర్ ను కలిపేసి ‘కల్తీ’ చేయవచ్చు. మద్యపాన ప్రియులను వంచించి భారీ ఎత్తున లాభాలు ఆర్జించవచ్చు.. మంజూరైన షాపులన్నీ నడపకుండా, పరిమిత సంఖ్యకు కుదించుకోవచ్చు. నిర్వహణా భారంతో మిగతా వాటిని మూసేయవచ్చు. నడుపుతున్న షాపుల్లో ఎంపిక చేసిన బ్రాండ్ల మద్యం మాత్రమే విక్రయించవచ్చు.. ‘సిండికేట్’ దందాలో ఈ తరహా బాగోతాలెన్నో జరుగుతుంటాయనే ప్రచారం వ్యాపార వర్గాల్లోనే ఉంది. గరిష్ట చిలర్ల ధర (ఎం ఆర్ పీ) ను మించి లిక్కర్ విక్రయాలు జరిపినా సిండికేట్ ను ప్రశ్నించే వారే ఉండరు. అబ్కారీ అధికారులూ కిమ్మనరు.. అందుకు కారణాలు అనేకం.

అందువల్ల మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే.. ఇల్లెందు వైన్ షాపుల వ్యాపారంలో ‘సిండికేట్ గణేష్’పై భాగస్వామ్య వ్యాపారుల ఆరోపణలు సంగతెలా ఉన్నప్పటికీ, ఇల్లెందులో గణేష్ అనే వ్యక్తి ‘సిండికేట్’ దందా నిర్వహిస్తున్నట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిండికేట్ వ్యాపారం ద్వారా ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు అగ్రిమెంట్ పత్రంలోని అంశాలు పేర్కొంటున్నాయి. ఎక్సైజ్ చట్టం నియమ, నిబంధనలకు విరుద్ధంగా ‘సిండికేట్’ దందాను నిర్వహిస్తున్న కొండపల్లి గణేష్ పై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఈ అగ్రిమెంట్ బాండ్ పేపర్ ఆధారంగా సరిపోదా? అని ఇల్లెందు పట్టణ మద్యపాన ప్రియులు ప్రశ్నిస్తున్నారు. అబ్కారీ అధికారులు కండ్లు మూసుకుంటే.. ‘సిండికేట్ గణేష్’ ఇట్లా ఒప్పంద పత్రాలు రాసుకుని బరితెగించడా మరి..? అనే వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

