హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ సుప్రీం లీడర్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతిని ప్రభుత్వానికి లొంగిపోవలసిందిగా తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. భారత్ ఇప్పుడు నక్సల్ రహిత దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం రాత్రి లోక్ సభలో ప్రకటించిన నేపథ్యంలోనే గణపతి లొంగిపోవాలని డీజీపీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గణపతితోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, కమ్యునికేషన్ వింగ్ ఇంఛార్జి వర్త శేఖర్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు జోడే రత్నబాయి, మావోయిస్ట్ పార్టీ విద్యా విభాగంలో గ ల నక్క సుశీల, అబూజ్ మడ్ డీవీసీఎం రంగబోయిన భాగ్య కూడా లొంగిపోవాలని ఆయన కోరారు. అజ్ఞాతంలో గల ఆయా నక్సలైట్లు, కేడర్ ఆయుధాలు సహా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు.
ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ప్రస్తుతం వయోభారంతో కూడిన ఆరోగ్య, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. గణపతి జనజీవన స్రవంతిలోకి వస్తే వెంటనే ఆయనకు హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణాకు చెందిన ఆయా ఆరుగురు నక్సలైట్లు లొంగిపోవాలని, వారికి భద్రత, గౌరవం, కొత్త జీవితానికి అవసరమైన అన్ని సహాయాలను అందించడానికి తెలంగాణా పోలీసులు కట్టుబడి ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి స్పస్టం చేశారు.
డీజీపీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠాన్ని దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు..

