ఖమ్మం: యాజమాన్యాలవైపు కాకుండా శ్రామికుల పక్షాన నిలిచే ప్రభుత్వ అధికారులు ఉంటే బాధిత కుటుంబాలకు జరిగే సిసలైన కార్మిక న్యాయానికి నిదర్శనం ఈ ఘటన.. ఎక్కడో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ కార్మిక కుటుంబం.. ఆ కుటుంబ యజమాని ఖమ్మంలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తమ ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణించినందుకు పరిహారం వస్తుందని కూడా ఆ కుటుంబానికి తెలియదు. ఓ లాయర్ ను ఏర్పాటు చేసుకుని లేబర్ కోర్టులో న్యాయ పోరాటం చేయాలనే విషయంపైనా ఆ కుటుంబానికి ఏమాత్రం అవగాహన లేదు..
కానీ ఆ బాధిత కుటుంబానికి ఖమ్మం జిల్లా కార్మిక శాఖ అండగా నిలిచింది. ఆ శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్ కె. విజయభాస్కర్ రెడ్డి చనిపోయిన కార్మికుని కుటుంబానికి చట్టపరంగా బాసటగా నిలిచారు. సంబంధిత గ్రానైట్ కంపెనీ నుంచి రూ. 24.50 లక్షల పరిహారాన్ని ఇప్పించారు. కార్మిక శాఖ చరిత్రలోనే బహుషా ఈ తరహా పరిహారపు చర్య అరుదైన ఘటన కావచ్చు. పశ్చిమ బెంగాల్ నుంచి బాధిత కుటుంబ సభ్యులను పిలిపించి అక్షరాలా ఇరవై నాలుగున్నర లక్షల రూపాయల పరిహారాన్ని ఇప్పించిన డీసీఎల్ విజయ భాస్కర్ రెడ్డి ఈ ఘటనలో చూపిన చొరవను కార్మిక సంఘాలు, వాటి ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. ఘటన పూర్వాపరాల్లోకి వెడితే..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలోని శారదా స్టోనెక్స్ గ్రానైట్ పరిశ్రమలో నిరుడు ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన ప్రమాద ఘటనలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు రాకేష్ జన (23) ప్రాణాలు కోల్పోయాడు. రాకేష్ మరణంతో అతనిపై ఆధారపడిన నలుగురు కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. రాకేష్ భార్య సోమశ్రీ, కుమార్తె మౌమీత, తల్లి భాగమతి, తండ్రి ప్రదీప్ లు దిక్కుతోచని స్థితిని ఎదుర్కున్నారు.
రాకేష్ ఉద్యోగ సంబంధ విధి నిర్వహణలోనే ఉండగానే ఈ ప్రమాదం సంభవించిందని కార్మిక శాఖ అధికారులు తమ విచారణలో నిర్ధారించారు. ఘటనపై స్పందించిన ఖమ్మం జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె. విజయ భాస్కర్ రెడ్డి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే కార్మిక పరిహార చట్టం 1923లోని 4A, 10A(2) సెక్షన్ల కింద సంబంధిత గ్రానైట్ కంపెనీ యజమానికి అధికారిక నోటీసు జారీ చేశారు. మరణించిన కార్మికుని నెలవారీ వేతనం, కార్మిక చట్టంలోని షెడ్యూల్ IV ప్రకారం వయోముఖ అంశం (Age Factor) 219.95 ఆధారంగా చట్టపరమైన పరిహారంగా రూ.16,50,000/ మొత్తాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించేవిధంగా నిర్ణయించారు.
కార్మిక శాఖ జారీ చేసిన నోటీసుపై శారదా స్టోనెక్స్ యజమాని పరుచూరి మురళీకృష్ణ కూడా మానవీయంగా స్పందించడం విశేషం. చట్ట ప్రకారం చెల్లించాల్సిన రూ.16,50,000/ మొత్తాన్ని కార్మిక శాఖలో డిపాజిట్ చేసిన అనంతరం, అదనంగా మరో రూ. 8,00,000/- మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియా రూపంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ఇచ్చారు. వెరసి రూ.24,50,000 మొత్తం బాధిత కుటుంబానికి పరిహారంగా లభించింది.

వాస్తవానికి ఈ ప్రమాదపు ఘటనలో మరణించిన కార్మికునికి చట్టప్రకారం పరిహారం వస్తుందని కూడా తెలియని స్థితిలో బాధిత కుటుంబం ఉంది. కానీ కార్మిక శాఖ అధికారులు స్వచ్ఛందంగా స్పందించి గ్రానైట్ కంపెనీ యజమానికి నోటీసు పంపించి, పరిహారపు సొమ్మును డిపాజిట్ చేయించారు. కుటుంబ సభ్యులను పశ్చిమ బెంగాల్ నుండి ఖమ్మంకు రప్పించి గురువారం పరిహారం అందజేయడం విశేషం. ఈమేరకు డీసీఎల్ విజయభాస్కర్ రెడ్డి బాధిత కుటుంబానికి గురువారం రూ. 24.50 లక్షల మొత్తపు పరిహారాన్ని స్వయంగా అందించారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డికి, గ్రానైట్ కంపెనీ యాజమాన్యానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఖమ్మం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా, శారీరకంగా వైకల్యం చెందినా, దురదృష్టవశాత్తు మరణం సంభవించినా కార్మిక కుటుంబాలు తమను సంప్రదించాలని సూచించారు. తమకు గల హక్కుల గురించి, పరిహారం గురించి తెలిసినా, తెలియకపోయినా తమవద్దకు రావాలని కోరారు. తద్వారా బాధిత కుటుంబాలకు చట్టపరంగా జరగాల్సిన న్యాయాన్ని అందిస్తామని, పరిహారం చెల్లించేవిధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మిక హక్కుల విషయంలో సందేహాలుగాని, ఫిర్యాదులుగాని సమీప కార్మిక శాఖ కార్యలయంలో సంప్రదించాలని కూడా డీసీఎల్ విజయభాస్కర్ రెడ్డి సూచించారు.

