ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేత ఘటనలో నిరాశ్రయులైన పేదలకు తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గట్టి భరోసానిచ్చారు. వెలుగుమట్లలో పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా ఈ మోడల్ కాలనీ నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ వెలుగుమట్ల నిరాశ్రయులైన అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, గురుకుల పాఠశాలల వంటి ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాదు కరెంటు, నీళ్లు, రోడ్లు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సకల మౌళిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రేపటి నుంచే (గురువారం) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని, భూమి పూజ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.
వచ్చే డిసెంబర్ 9వ తేదీకల్లా మోడల్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానని, ముగ్గురు మంత్రులము కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని భట్టి ప్రకటించారు. కాలనీ ప్రారంభోత్సవంలో పాలు పొంగించాలి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశాలు జరగాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇది పేదల పక్షాన తమకు గల నిబద్ధతగా భట్టి చెప్పారు. ఇండ్లు కట్టిస్తామని పదేళ్లపాటు పరిపాలించిన వారు చెప్పిన మాటలు నమ్మి చూసి చూసి పేదల కళ్ళు కాయలు కాశాయే తప్ప, వారు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదన్నారు. అలాంటి వారికి తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు.

ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఆలోచనగా చెప్పారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో పేదవారి కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు 22,500 కోట్లు ఒకేసారి మంజూరు చేసి చరిత్రలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమదిగా డిప్యూటీ సీఎం తెలిపారు. ఇలాంటి ప్రభుత్వంపై కావాలని, పేదలకు మేలు జరగవద్దని కొద్దిమంది బురద జల్లుతున్నారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.
గత కొన్ని సంవత్సరాలుగా మాఫియా వెలుగుమట్లలో పేదల నుంచి డబ్బులు వసూలు చేసిందని, వారికి కనీస సౌకర్యాలు లేకుండా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలని వెలుగుమట్లలో అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. పేదలు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆత్మ గౌరవంగా బతికేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రజా ప్రభుత్వం వెనుకాడదని భట్టి ప్రకటించారు.
వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి తర తమ భేదం లేకుండా ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసినట్టు తెలిపారు.పేదల నిసహాయతను అడ్డుపెట్టుకొని బతికే మాఫియా శక్తులను దరిదాపుల్లోకి రానివ్వద్దని పేదలకు, అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.

