హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ సుప్రీం లీడర్ మప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ప్రాణానికి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. గణపతి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. తమ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఆయన ప్రాణానికి తెలంగాణా ప్రభుత్వం హామీ ఇస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొండపల్లి సీతారామయ్య తర్వాత ప్రజల్లో అత్యంత గుర్తింపు గల గణపతి జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం కోరారు. గణపతితోపాటు ఇంకా అడవుల్లో గల మావోయిస్టులు ఆయుధాలు సహా లొంగిపోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వ పిలుపునకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఛత్తీస్ గఢ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 130 మంది నక్సల్స్ తన సమక్షంలో లొంగిపోయిన సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని, ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రాణరక్షణ కల్పించడంతోపాటు, సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

జనజీవన స్రవంతిలో కలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిలుపును విశ్వసించి మావోయిస్టులు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. లొంగిపోయిన వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా, వారికి ఆర్థిక సహాయం, ఇతర వసతులు కల్పిస్తామనే నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను అభినందించారు.
మహాత్మా గాంధీ తన శాంతియుత పోరాటంతో ఒక యుద్ధాన్ని జయించిన స్థాయిలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని, నేడు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా చివరకు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు.
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు ముఖ్య నేతలు దేవ్ జీ, బడే దామోదర్, రాజిరెడ్డి, చంద్రన్న తదితరులతో సమావేశమైనప్పుడు వారి పునరావాసానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు తన ముందుంచారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
మావోయిస్టుల లొంగుబాటు, పునరావాసం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెరుగైన ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వంతో, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఇందిరమ్మ ఇళ్లతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల మేరకు చట్టపరమైన అంశాలను పరిశీలించి, కేసుల ఎత్తివేతపై ఆలోచన చేస్తామని, అవసరమైతే కేసుల పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమాజంలో హింసకు స్థానం లేదని, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోతే వారికి ఆరోగ్యం, ఆర్థిక వెసులుబాటు, నివాస వసతి కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు చెక్కులను అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీ (ఇంటలిజెన్స్) విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి, ఇతర అధికారులు ఉన్నారు.

