ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం సాయంత్రం కీలక ప్రకటన విడుదల చేశారు. వెలుగుమట్ల గ్రామ సర్వే నం. 147, 148, 149 లోని భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు, స్వాధీనం చర్యలు పూర్తిగా చట్టబద్ధమైనవని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడ మొత్తం 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా, సంబంధిత భూమి మొత్తం విలువ సుమారు రూ. 250 కోట్లకు పైగా ఉంటుందన్నారు. భూదాన్ బోర్డు భూమిని సీసీఎల్ఏ, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోవడం ద్వారా భారీ స్థాయిలో ఆస్తిని రక్షించగలిగామని కలెక్టర్ తెలిపారు. ఈనెల 24వ తేదీన నిర్వహించిన కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దానిని తిరస్కరించినట్లు కూడా కలెక్టర్ తెలిపారు.
భూదాన్ యజ్ఞ బోర్డు, రెవెన్యూ శాఖ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగు చూశాయన్నారు. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. హైకోర్టు స్టే ఉన్న నిర్మాణాలను మినహాయించి మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనం లోకి తీసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న భూమిని భవిష్యత్ ప్రజా అవసరాలకు ఉపయోగిస్తామని, ఇండ్లు కోల్పోయిన వారిలో అర్హులైన స్థానిక పేదలకు ప్రభుత్వం తగు విధంగా న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తన ప్రకటనలో తెలిపారు.

