సత్తుపల్లి: సైబర్ నేరాల దోపిడీ కేసులో అత్యంత కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి సహా 14 మంది నిందితుల ముఠాను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఏసీపీ వసుంధర యాదవ్ కథనం ప్రకారం.. సైబర్ నేరాల్లో మోసపోయిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండకు చెందిన ఉడతనేని వికాస్ చౌదరి, అతని భార్య బొప్పన నాగప్రియ, అడపా రామ వెంకట చరణ్ చౌదరి అలియాస్ చరణ్ అనే ముగ్గురిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిన్న రాత్రి 7.00 గంటల ప్రాంతంలో సత్తుపల్లి బస్టాండ్ వద్ద చరణ్ ను అరెస్ట్ చేయగా, వికాస్ చౌదరి దంపతులు సాగించిన సైబర్ మోసాల గుట్టును పోలీసులకు వివరించాడు.
వికాస్ చౌదరి, అతని భార్య నాగప్రియ 2020 సంవత్సరం నుంచి ఆన్ లైన్ గేమింట్, బెట్టింగులు ఆడి, విదేశాల్లోని కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వికాస్ చౌదరి దంపతులు కాల్ సెంటర్ నడుపుతూ, వాటి ద్వారా మనదేశంలోని పౌరులకు ఫోన్లు చేస్తూ, అధిక లాభాల ఆశ చూపి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో ట్రేడింగ్, గేమింట్, బెట్టింగ్, ఓటీపీల మోసాలకు, మ్యాట్రిమోనీ పేర్లతోనూ వివిధ రకాల లింక్ లు, క్యూఆర్ కోడ్ లు పంపుతూ మోసపూరిత మార్గాల ద్వారా బాధితుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును కాజేసేవారు.

అంతేగాక స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నామని, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నిర్వహిస్తున్నామని, అందుకు తమకు పలు బ్యాంక్ అకౌంట్ల అవసరం ఉందని చెప్పేవారు. తద్వారా కొందరితో పలు బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వారికి నెలకు రూ. 50,000తోపాటు ప్రతి కరెంట్ అకౌంట్ కు రూ. 20,000, దాన్ని ఓపెన్ చేసిన వ్యక్తికి రూ. 10,000 చొప్పున ఇచ్చేవారు.
వికాస్ చౌదరి అండ్ గ్యాంగ్ అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్థులతో జతకట్టి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ వాటి ద్వారా మనదేశంలోని పౌరులను మోసం చేస్తూ అకౌంట్లలోని డబ్బును ఖాళీ చేస్తుండేవారని ఏసీపీ వివరించారు. ఈ తరహా సైబర్ క్రైమ్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ అకౌంట్లలోకి బదలాయించేవారని, ఆ తర్వాత కొన్ని కరెంట్ అకౌంట్లలోకి మార్చి, చివరగా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకునేవారని చెప్పారు. చివరి ప్రక్రియగా అమెరికా డాలర్లలోకి, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చేవారని ఏసీపీ తెలిపారు.
ఈ విధంగా తన ద్వారా మొత్తం 22 మంది వ్యక్తులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారని, అందుకు ప్రతి అకౌంట్ కు రూ. 10,000 మొత్తాన్ని ఇచ్చి, ఇందుకు కమిషన్ గా తాను రూ. 20,000 మొత్తాన్ని ఉడతనేని వికాస్ చౌదరి, అతని భార్య బొప్పన నాగప్రియ నుంచి తీసుకునేవాడినని అడపా రామ వెంకటచరణ్ చౌదరి తమ విచారణలో వెల్లడించినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ వివరించారు.
కేసు దర్యాప్తులో భాగంగా అడపా చరణ్ ఇచ్చిన సమాచారంతో కీలక నిందితుడైన వికాస్ చౌదరి సహా 14 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. తాజాగా అరెస్టయిన నిందితుల్లో అడపా వెంకట రామచరణ్, అడపా సూర్య వెంకట తరుణ్, ఇలాసారపు అనిరుధ్, పోట్రు వంశీ, పోట్రు చైతన్యసాయి, దోసపాటి నవీన్, నల్లబోతుల భవాని సత్యశేఖర్, కాపుగంటి జోగేంద్ర శేషు, దేవళ్ల వేణు, మామిడిశెట్టి సాయికుమార్, పటాన్ ఇమ్రాన్ ఖాన్, ఉప్పతల గోపి, దొబ్బల వెంకటేష్ ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదే కేసులో మరో ఎనిమిది మంది నిందితులు బొప్పన నాగప్రియ, ఇస్లావత్ లక్ష్మి కళ్యాణ్, శీలం వేణుగోపాల్ రావు, నల్లంగుల శ్వేతన్, వీరంశెట్టి వంశీ, బిల్లా సాయితరుణ్, సంగం ప్రవీణ్ కుమార్, భూక్యా తరుణ్ పరారీలో ఉన్నారని ఏసీపీ చెప్పారు. కేసు ఇంకా పరిశోధనలో ఉందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఏసీపీ వసుంధర యాదవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

