హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా జరిగిన కుంభకోణంపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన అంశాలు వెల్లడించారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా ధరణి వ్యవహారం వెలుగు చూసిందన్నారు. ఈ అక్రమాలపై కఠిన చర్యలు తప్పవన్నార. ధరణి పోర్టల్ వ్యవహారంపై బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతస్థాయి కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం కొల్లగొట్టిన సంఘటనపై విచారణ నిర్వహించినట్లు చెప్పారు. ఈ విచారణలో అది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపమని వెల్లడైనట్లు చెప్పారు. అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని ఉన్నత స్ధాయి కమిటీ విచారణలో ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫోరెన్సిక్ కోర్ ఆడిట్ లో కోడ్ ఆడిట్ నిర్వహించలేదని, తక్షణమే ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
సిరిసిల్ల, సిద్దిపేట తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, ధరణి పేరుతో జరిగిన ప్రతి దోపిడీని వెలికితీస్తామన్నారు. టెర్రాసిస్ అనే విదేశీ సంస్థకు నిర్వహణ అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సొమ్మును, ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామన్నారు.
అక్రమాలకు తావులేకుండా, అధికారుల అనవసర ప్రమేయం లేకుండా ప్రజలకు అత్యంత స్నేహపూర్వకంగా ఉండేలా ‘భూ భారతి’ పోర్టల్‌ను తీర్చిదిద్దుతున్నట్లు పొంగులేటి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజల భూములకు, ఆస్తులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉన్నత స్ధాయి కమిటీ సభ్యులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజి సుభాష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ సింధు శర్మ, సైబర్‌క్రైమ్ డిఎస్పీ ఎ.సంపత్, హోంశాఖ సలహాదారు పి.శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

