తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీసులు సంచలన ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిన్న వాయిదా పడిన తొర్రూరు మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక మంగళవారం నిర్వహిస్తున్న పరిస్థితుల్లో పోలీసులు ఈ కీలక ఆదేశాలను జారీ చేయడం గమనార్హం. మంగళవారం ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే బీఎన్ఎస్ చట్టంలోని 163 సెక్షన్, సీఆర్పీసీలోని 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

అందువల్ల తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో గల షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవరాదని ఆదేశించారు. ఎన్నిక ముగిసే వరకు వారి వారి కుటుంబ సభ్యులు మినహా రాజకీయ పార్టీలకు చెందినవారినిగాని, ఇతరులనుగాని తమ తమ ఇళ్ల్లలోగాని, ఇంటి పరిసరాల్లోగాని గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

అదేవిధంగా తమ తమ ఇళ్ల వద్ద మైక్ అనౌన్స్మెంట్లు, పార్టీల ప్రచార వాహనాలు, డీజేలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయవద్దని, అటువంటి కార్యక్రమాలకు సహకరించరాదన్నారు. ఎన్నిక రోజున చుట్టుపక్కల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఎవరి వాహనాలను కూడా ఇళ్లముందు పార్క్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తొర్రూరు పోలీసులు హెచ్చరించారు.

మొత్తంగా నిన్నటి ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో తొర్రూరు పట్టణం పోలీసు బందోబస్తును భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు ఆ ఇద్దరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. తొర్రూరు పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

