ఢిల్లీ: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు ఆరునెలల పదవీ కాలం పొడిగింపు వస్తుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అంటే 2029లో జమిలి ఎన్నికలు ఖాయంగా చెప్పారు. వచ్చే ఏడాదికల్లా జనగణన పూర్తవుతుందని, 2029 కల్లా మహిళా రిజర్వేషన్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు జరుగుతుందన్నారు.
దీంతో తనకు ఆరునెలల పదవీ కాలం పొడిగింపు వస్తుందని, ఈ పీరియడ్ లో మొత్తం ఐదున్నరేళ్లపాటు సీఎంగా ఉంటానని, ఆ తర్వాత మరో ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, మొత్తం పదిన్నరేళ్లపాటు తెలంగాణా రాష్ట్రానికి తానే సీఎం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణా రాష్ట్రానికి తానే రాజునని, తానే మంత్రినని కూడా రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ ఏపీ ఎన్వోసి ఇస్తే ఆ రాష్ట్రం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కృష్ణా జలాలకు ఓ రూల్, గోదావరి జలాలకు మరో రూల్ అంటే కుదరదన్నారు. దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తానే వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తానన్నారు. హైదరాబాద్ లో త్వరలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఆయన జాతీయ నాయకుడని, జాతీయ సొత్తు మాత్రమేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
విద్యుత్ కమిషన్ కేసు కూడా కేంద్రానికి ఇస్తామని ప్రకటించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇచ్చామని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాసు కేసీఆర్, కేటీఆర్ అని, వారిని కాపాడటానికే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడని రేవంత్ ఆరోపించారు. వందకు వంద శాతం తాను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదన్నారు. ఇతరుల మాటలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటే మనశ్శాంతి ఉండదని, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ అంశంలో పారదర్శకంగా విచారణ నిర్వహించాలని అధికారులకు చెప్పానని, అందుకే తాను జోక్యం చేసుకోవడం లేదన్నారు.
ఈ కేసులో ప్రభాకర్ రావు ను విచారించేందుకే తమకు 20 నెలలు పట్టిందని, ప్రభాకర్ రావు అరెస్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. అయితే తాము సుప్రీంకోర్టు ద్వారా ప్రభాకర్ రావును రప్పించామన్నారు. ఈ కేసులో త్వరలో చార్జిషీట్ కూడా వేయాలని ఆదేశాలు ఇచ్చానని, ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ విచారణ జరిగిందన్నారు. కాగా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును ఎవరు బాంబులతో పేల్చలేదని, బాంబులతో పేలిస్తే ప్రాజెక్టు పైకి లేస్తుందని, గుంతలోకి కురుకుపోదని రేవంత్ పేర్కొన్నారు.
నైని కోల్ బ్లాక్ వేలం నిబంధనల్లో సైట్ విజిట్ నిబంధన ఉందని సీఎం చెప్పారు. ఆ నిబంధనను కేంద్రమే పెట్టిందని, తాము ఒక్క నిబంధనను కూడా మార్చలేదన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సాక్షిగా సాక్షాలన్నీ బయటపెడతానని ప్రకటించారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలేవీ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో లేవని సీఎం వెల్లడించారు. ఇటువంటి కేసులను అప్పటికప్పుడే విశ్లేషణ చేసి నివేదికలు ఇస్తారని, 2021లోనే ఓటుకు నోటు కేసు ఆధారాలు సబ్మిట్ చేశారని, ప్రస్తుతం ఉన్న కేసుల అనాలసిస్ మాత్రమే అక్కడ ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కౌన్సిలర్ సీటు కోసం మనుషుల్ని చంపుతారా? అని మక్తల్ లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ సీఎం ప్రశ్నించారు. ఇలా ఆరోపణలు చేస్తే పిచ్చోడు అంటారని, ఈ ఘటనపై స్థానిక పోలీసులపై నమ్మకం లేకుంటే, కిషన్ రెడ్డి కోరుకుంటే సీబీఐతో విచారణ జరిపిస్తామని కూడా రేవంత్ అన్నారు. కాగా శంషాబాద్ విమానాశ్రయం పక్కనే బుల్లెట్ ట్రయిన్ హబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. బుల్లెట్ రైలు హబ్ కోసం 600 నుంచి 700 ఎకరాలు ఇస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఈ రోజు చెప్పానని సీఎం వివరించారు.

