భూపాలపల్లి: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన పాపాలు ఊరకే పోవని, ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోతుందన్నారు. తనను ఏ సామాజికవర్గంతో కలిపి పిలుచుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనపైనా సీఎం కీలక ప్రకటన చేశారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
- నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులు ఈ దేశానికే ఆదర్శంగా ఉన్నారు.
- తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి పాల్గొన్నారు.
- ఎన్టీఆర్ మొదట భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి బొగ్గు వెలికితీతకు పునాదిరాయి వేశారు.
- భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు.
- రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించడం కాని, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం కాని ప్రభుత్వ పరిశీలనలో లేవు.
- జిల్లా పునర్విభజనపై అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపైన ఆలోచన చేస్తాం.
- కుట్రలు, కుతంత్రాలతో విష ప్రచారాలు చేస్తున్నవారిని గమనించాలి.
- భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు.
- తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- సింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ అన్ ఫిట్ బోర్డును రద్దు చేస్తాం.
- సింగరేణి వారసత్వ ఉద్యోగాలపైన కొందరు విష ప్రచారం చేస్తున్నారు.
- మెడికల్ బోర్డు పైన విష ప్రచారం చేసే వారిని మోకాళ్లపై కూర్చోబెట్టాలి.
- సింగరేణి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
- సింగరేణి కార్మికులు నిండు మనసుతో పనిచేసి కాంగ్రెస్ జెండాను మోయడం వల్లనే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది.
- ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులది.. వారికి నష్టం కల్గించే పనిచేయం.
- 217 డిస్మిస్ కార్మికుల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుంది.
- వెయ్యేళ్లు గుర్తుండేలా మేడారం ఆలయం నిర్మించాం.
- సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా నిర్మించాం.
- 2027లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతంగా 3,4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం.
- గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం.
- పదేళ్లు కేసీఆర్ సీఎంగా, మూడు సార్లు ప్రధానిగా మోదీ ఉన్నారు.
- కేసీఆర్, మోదీలను చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ చెపుతున్నాయి.
- కేసీఆర్, మోదీ బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికి వస్తారు.
- పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే సంసారం ఆగం అవుతుంది.
- కాంగ్రెస్ కు ఓటేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి.
- ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బోర్లా బొక్కలా పడుకున్న కేసీఆర్ మీకు నిధులు ఇవ్వడు.
- పదేళ్లు సీఎంగా ఉండి భూపాలపల్లికి బై పాస్ రోడ్డు తీసుకురాలేదు.
- కేసీఆర్, మోదీలను చూసి ఓటు వేస్తే మోసపోతారు జాగ్రత్త.
- మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీరు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లుంది.
- కేసీఆర్ ఇంటిల్లిపాలికి పదవులు ఇచ్చుకున్నడు కాని పేదలకు ఏమీ చేయలేదు.
- కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపిస్తే గండ్ర వెంకటరమణారెడ్డి కేసీఆర్ సంకన చేరాడు.
- ఎవరకి వారు వాళ్లు తమ సామాజిక వర్గం పేరుతో నన్ను పిల్చుకున్నారు.. ఎవరు ఎలా పిలిచినా సంతోషిస్తా.
- కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ ను అరెస్టు చేయకుండా అడ్డుపడుతున్నాడు.
- నేను ఏమైనా సీఎంనా.. అరెస్ట్ చేయడానికి అని కిషన్ రెడ్డి అంటున్నాడు.
- వేలకోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా, రాహుల్ గాంధీని కేసుల పేరుతో సీబీఐ, ఈడీ పేరుతో తిప్పించి అవమానించలేదా..?
- గాంధీ కుటుంబాన్ని మానసిక క్షోభ కల్గించిన మీకు ఉసురు తగలదా?
- రాహుల్ గాంధీని ఈడీ, సీబీఐ కేసులతో వేధిస్తున్నారు.
- గాందీ కుటుంబంపైన ఈడీ , సీబీఐని ఉపయోగిస్తున్నప్పుడు కాళేశ్వరం పైన సీబీఐ విచారణకు పంపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారు?
- ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను కాపాడుతుంది మీరు కాదా..?
- కిషన్ రెడ్డి నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నాడు.
- ఫెవికాల్ బంధంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కిషన్ రెడ్డి కంచె వేసి కాపాడుతున్నాడు.
- కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను అరెస్టు చేసే వరకు కల్వకుంట్ల కిషన్ రావు అనే పిలుస్తాం.
- బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి.
- కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.
- చేసిన పాపాలు ఊర్కే పోవు..చేసిన పాపాల ఊబిలో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోతుంది.
- బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేర్వేరు కాదు.
- బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బొమ్మా, బొరుస లా.. బిల్లా, రంగలా.. కాంగ్రెస్ ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాయి.
- దెబ్బకు దెబ్బ కొడతాం.
- మీ తాతలు.. ముత్తాతలను తీసుకువచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ల సంగతి చూస్తారు.
- ఆడబిడ్డల ఆశ్వీర్వాదం ఉంటే మోదీ, కేసీఆర్ ల తాత వచ్చినా ఓడిస్తాం.

