Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

తమ్మినేని ‘పల్లె’లో ఏకగ్రీవ ఎన్నికపై సీపీఎం జిల్లా కార్యదర్శి సంచలన వ్యాఖ్య

ఖమ్మం: సీపీఏం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం స్వగ్రామమైన పాలేరు నియోజకవర్గంలోని తెల్దారుపల్లిలో మున్సిపల్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘటనపై ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్య చేశారు. ఇక్కడ సీపీఎం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగి నామినేషన్ దాఖలు చేసిన తమ్మినేని కోటేశ్వర్ రావు భార్య విజయలక్ష్మి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో సీపీఎం పార్టీకి చెందినవారి చేతిలో హత్యకు గురైన తమ్మినేని క్రిష్ణయ్య భార్య తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే తమ్మినేని విజయలక్ష్మి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడం పార్టీ నిర్ణయం కాదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు ‘సమీక్ష’ న్యూస్ తో చెప్పారు. విజయలక్ష్మి పోటీలో ఉండేందుకే తాము బీ ఫారాన్ని కూడా పంపించామన్నారు. ఈ అంశంలో తమ్మినేని కోటేశ్వర్ రావు సొంతంగా తీసుకున్న నిర్ణయమే తప్ప, పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని నున్నా స్పష్టం చేశారు. తమ్మినేని క్రిష్ణయ్య హత్య కేసులో రాజీ మార్గపు పరిష్కారం కోసం తమ్మినేని నవీన్ కుటుంబం వైపు నుంచే ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. అయితే అది గ్రామంలోని మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు చేసిన ప్రతిపాదనగా నున్నా చెప్పారు.

ఇందుకు తాము ఒప్పుకోలేదని, తెల్దారుపల్లిలో ప్రశాంతతకోసం పరస్పరం అంగీకారం ఉండాలని, అదే సమయంలో రాజకీయ లబ్ధి కూడా సమంగా ఉండాలన్నదే తమ అభిప్రాయంగా నున్నా పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం కాకుండా, తమ్మినేని కోటేశ్వర్ రావు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన సతీమణి విజయలక్ష్మి నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు నున్నా నాగేశ్వర్ రావు వివరించారు. తమ్మినేని కోటేశ్వర్ రావు సీపీఎం అగ్రనేత తమ్మినేని వీరభద్రానికి స్వయానా సోదరుడు కాగా, తమ్మినేని క్రిష్ణయ్య హత్య కేసులో ఆయన నిందితునిగా ఉండడం గమనార్హం.

Popular Articles