హైదరాబాద్: ‘గౌరవనీయ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కె. చంద్రశేఖర్ రావు’గా పేర్కొంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు గురువారం నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపేందుకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్ కు పోలీసులు ఈ నోటీసులు అందించారు. బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు ఈమేరకు నోటీసులు అప్పగించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024 మార్చి 10వ తేదీన క్రైం నెం. 243/2024 ద్వారా నమోదైన కేసులో విచారణకు రావాలని సిట్ తరపున జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి సంతకంతో కూడిన నోటీసు జారీ చేశారు. ఈనెల 30వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటలకు విచారణకు హాజరు కావాలని, అయితే 65 ఏళ్లు నిండిన వ్యక్తులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కు రావలసిన అవసరం లేదనే సీఆర్పీసీ నిబంధనలు ఉన్నాయని కూడా నోటీసులో పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో స్వచ్ఛందంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావచ్చని, లేనిపక్షంలో విచారణకు హైదరాబాద్ నగరంలోని మీకు అనువైన స్థలాన్ని విచారణకు ఎంచుకోవచ్చని కూడా సిట్ అధికారులు కేసీఆర్ కు స్పష్టం చేశారు. విచారణకు కేసీఆర్ నిర్దేశించుకున్న అనువైన స్థలం గురించి ముందస్తు సమాచారాన్ని తమకు అందించాలని సిట్ అధికారులు తమ నోటీసులో కోరారు. తాము ఇచ్చిన నోటీసు ముట్టినట్లు తెలియజేయాలని కూడా కోరారు.

ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రి హరీష్ రావును, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ వరుస పరిణామాల్లోనే తాజా కేసీఆర్ ను సైతం ఇదే కేసులో విచారణ చేసేందుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
Update:
కాగా సిట్ అధికారులు పంపిన నోటీసుకు కేసీఆర్ గురువారం రాత్రి జవాబు ఇచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, నామినేషన్ల దాఖలకు ఈనెల 30వ తేదీ చివరి గడువని, ఆయా వ్యవహారాల్లో ముందస్తుగానే తాను కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్లు చెప్పారు. తనకు పంపిన నోటీసుకు సంబంధించి విచారణ జరిపేందుకు మరో తేదీని నిర్ణయించాలని, ఎర్రవల్లిలోనే తాను విచారణకు సిద్ధమని కేసీఆర్ సిట్ అధికారులకు పంపిన జవాబు పత్రంలో స్పష్టం చేశారు. తెలంగాణా మాజీ సీఎంగా, ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేతగా, బాధ్యతగల పౌరునిగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

