Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

కర్రెగుట్టల్లో వరుస పేలుళ్లు: ఎస్ఐ సహా 11 మందికి గాయాలు

ఛత్తీస్ గఢ్: తెలంగాణా-ఛత్తీస్ గఢ్ లోని కర్రెగుట్టల్లో వరుస మందుపాతరలు పేలాయి. ఈ పేలుళ్ల ఘటనలో ఎస్ఐ సహా 11 మంది జవాన్లు గాయపడ్డారు. అనూహ్యంగా ఎదురైన ఈ పేలుళ్లలో గాయపడిన ఎస్ఐని, భద్రతా బలగాలను చికిత్స కోసం రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలికలపై, మందుపాతరలు ఏర్పాటు చేశారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆదివారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టాయి.

మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ కోసం భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో వరుసగా పేలిన మందుపాతరల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్ (డీఆర్జీ) విభాగానికి చెందిన పోలీసులు కాగా, కోభ్రా విభాగానికి చెందిన 210 బెటాలియన్ ఎస్ఐ రుద్రేష్ సింగ్ ఉన్నారు. పేలుళ్ల ఘటనను ఛత్తీస్ గఢ్ పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.

కాగా నిరుడు ఏప్రిల్, మే నెలల్లో కర్రెగుట్టల్లో ఏకధాటిగా 21 రోజులపాటు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంగా 35 తుపాకులను, 450 మందుపాతరలను, డిటొనేటర్లను, ఇతరత్రా సామాగ్రిని పెద్ద ఎత్తున భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తద్వారా కర్రెగుట్టల్లో పైచేయి సాధించిన భద్రతా బలగాలు అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన విషయం కూడా తెలిసిందే.

Popular Articles