హైదరాబాద్: వాహనాలపై PRESS స్టిక్కర్ల వినియోగంపై తెలంగాణా ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. ఈమేరకు సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఓ మెమోను జారీ చేశారు.
అనధికారికంగా జెండాలు, చిహ్నాలు, పేర్లు, గుర్తులు, స్టిక్కర్లు, ముద్రలు, లోగోల ద్వారా పలువురు తమ వాహనాలపై అధికార హోదాను ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో కర్నాటక హైకోర్టు నిరుడు ఏప్రిల్ 4వ తేదీన ఇచ్చిన ఓ తీర్పును కూడా ఉటంకించారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లపైనా ఈ తరహా స్టిక్కర్లు, హోదాలను ప్రదర్శించుకుంటున్నవారి అంశాన్ని కూడా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో PRESS స్టిక్కర్ల అంశంలో వెంటనే చర్యలు తీసుకోవాలని వివిధ జిల్లా డీపీఆర్వోలను ఆమె ఆదేశించారు. సమాచార శాఖ ద్వారా అక్రిడిటేషన్ గుర్తింపు గల జర్నలిస్టులకు మాత్రమే PRESS స్టిక్లర్ల వినియోగానికి అనుమతించాలన్నారు. ఇందుకు విరుద్దంగా PRESS స్టిక్కర్లు వినియోగించేవారి విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీపీఆర్వోలను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశించారు.
అయితే ఈ విషయంలో డీపీఆర్వోలు తీసుకునే చర్యలపై మీడియా వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనధికారికంగా PRESS స్టిక్కర్లను అంటించుకుని తిరిగే వ్యక్తుల విషయంలో రాష్ట్ర డీజీపీని అభ్యర్థిస్తూ స్పెషల్ కమిషనర్ ఉత్తర్వు జారీ చేస్తే వేగవంతమైన ఫలితాలు ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ కమిషనర్లను, జిల్లా ఎస్పీలను ఆదేశిస్తూ డీజీపీ ఉత్తర్వు ఇస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సమాజ హితాన్ని కోరే జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

