హైదరాబాద్: నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద నమోదైన కేసులో ఉప్పల్ పోలీసులకు లొంగిపోవాలని ‘సిరిగోల్డ్’ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్, బీజేపీ నాయకుడు కూసంపూడి రవీంద్రను తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్నటువంటి రవీంద్ర ముందస్తు బెయిలు (యాంటిసిపేటరీ బెయిల్) కోసం చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
ఇందులో భాగంగానే పిటిషనర్ అయినటువంటి కూసంపూడి రవీంద్ర రెండు వారాల్లోపు ఉప్పల్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ముందు లొంగిపోవాలని, ఆ తర్వాత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అతన్ని బెయిల్ పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతోపాటు రూ. 25,000 వ్యక్తిగత బాండ్ ను సమర్పించాలని కోర్టు రవీంద్రను నిర్దేశించింది.
అంతేగాక ప్రతి బుధవారం ఉదయం 9.00 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య ఎనిమిది వారాలపాటు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పేర్కొంది. కేసు దర్యాప్తుకోసం, కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసే అంశాల్లో దేనికి సంబంధించితే దానికి అవసరమైనపుడు హాజరు కావాలని సూచించింది. ఈ అంశంలో పిటిషనర్ అయినటువంటి రవీంద్ర బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 482 (2)లో నిర్దేశించిన ఇతర షరతులకు కట్టుబడి ఉండాలని, కేసు దర్యాప్తునకు సంబంధిత అధికారికి సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.

