ఖమ్మం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వస్తున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి స్థానికంగా గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ముఖ్యంగా ఖమ్మం నగరపాలక సంస్థలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్ధతుతో గెలుపొందిన సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లను సన్మానించేందుకు కేటీఆర్ బుధవారం ఖమ్మం పర్యటనకు వస్తున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా వెయ్యి బైకులతో ఆయనకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు సన్నద్ధమవుతున్న స్థితిలో ఆ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేటర్లు దఫ దఫాలుగా కాంగ్రెస్ లో చేరుతుండడం గమనార్హం.
కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైందే తడవుగా ఈనెల 5వ తేదీన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లలో చిరుమామిళ్ల లక్ష్మి (12వ డివిజన్), గోళ్ల చంద్రకళ (25వ డివిజన్), దోణవాన్ సరస్వతి (32వ డివిజన్), దాదె అమృతమ్మ (40వ డివిజన్), మోతారపు శ్రావణి (55వ డివిజన్)లు ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరందరినీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్ధవంతమైన నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నిలిపేందుకు వీరందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ లో చేరినట్లు ప్రకటించారు.
ఈ ఘటన నుంచి గులాబీ పార్టీ నేతలు తేరుకోకముందే గులాబీ పార్టీకి చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు బుధవారం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన ధనాల రాధ, తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, టూ టౌన్ ఏరియాకు చెందిన ఒకరు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మొత్తంగా కేటీఆర్ ఖమ్మం పర్యటన నేపథ్యంలో వరుసగా చోటు చేసుకుంటున్న కార్పొరేటర్లు పార్టీ మారుతున్న పరిణామాలు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి.

