Top 5 This Week

Related Posts

‘సారు’ నవ్విండు! తోలు తీస్తమన్నరు!!

హైదరాబాద్: గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ నవ్విండు. ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడేముందు కేసీఆర్ కడుపారా నవ్విన దృశ్యం బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త సంతోషాన్ని కలిగించి ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఫాం హౌజ్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ లెజిస్లేచర్, రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జాయింట్ గా నిర్వహించారు. తొలుత తెలంగాణా భవన్ లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ఇటవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారిందరికీ అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని సంబురపడ్డారు. అధికార పార్టీపై స్థానిక ఎన్నికల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతకు ఫలితాలు నిదర్శనమన్నారు. అధికార గర్వంతో ఎగిరెగిరిపడుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కేసీఆర్ అన్నారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ఇది సర్వభ్రష్ట ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక కథ, రేపటినుంచి మరో కథ ఉంటుందన్నారు. తోలు తీస్తామన్నారు. పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తుతామన్నారు. రెండేళ్లపాటు వేచి చూశామని, అటు కేంద్ర ప్రభుత్వాన్నే కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా తూర్పారబడుతామన్నారు. గ్రామ గ్రామా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. బహిరంగ సభల నిర్వహణ ద్వారా చేష్టలుడిగి చూస్తున్న సర్కారు సంగతేమిటో తేలుస్తామన్నారు.

ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని నిలదీస్తామన్నారు. సభలకు స్వయంగా తానే హాజరవుతానని చెప్పారు. తమకు అధికారం చేజారిందనే అక్కసును ఏనాడూ ప్రదర్శించలేదన్నారు. లగచర్లవంటి అనేక ప్రజా సమస్యలపై పార్టీ పోరాడుతూనే ఉందన్నారు. గోదావరి, కృష్ణానదుల్లో జరుగుతున్న జలదోపిడీపై ఈ ప్రభుత్వం మిన్నకుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదే తెలంగాణా పరిరక్షణ కోసం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణా కోసం తాము ఎవరితోనైనా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరముందని, కండ్లముందే జరుగుతున్న అన్యాయాలను చూస్తూ కేసీఆర్ మౌనంగా ఉండడని స్పష్టం చేశారు.

Popular Articles