(సమీక్ష ప్రత్యేక కథనం)
తెలంగాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బహుషా ఇదే రికార్డు స్థాయి మెజారిటీ కావచ్చు. మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గానికి గుండెకాయగా భావించే ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కాకులమర్రి శ్రీలత ఈ భారీ మెజారిటీ సాధించడం విశేషం. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనో ఓ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన అనుభూతిని కలిగించినట్లు గోచరించే సంఘటన ఇది. ఏటూరునాగారం సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 8,333 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత 5,560 ఓట్లు సాధించి, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన తన సమీప అభ్యర్థి గుడ్ల శ్రీలతపై 3,230 ఓట్ల మెజారిటీని సాధించడం గమనార్హం. కాంగ్రెస్ కంచుకోటగా గత చరిత్ర గల ములుగు నియోజకవర్గంలో కీలక కేంద్రమైన ఏటూరునాగారం సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి తొలిసారి గెల్చినప్పటికీ, ‘రికార్డు’ స్థాయి మెజారిటీ సాధించడం వెనుక దాగిన రాజకీయ నేపథ్యమూ అత్యంత ఆసక్తికరమే.

ఇంతకీ ఎవరీ కాకులమర్రి శ్రీలత..?
కాకులమర్రి విజయరామారావు గుర్తున్నారు కదా! సీబీఐ డైరెక్టర్ గా పనిచేసిన విజయరామారావు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గానూ పనిచేసిన ఐపీఎస్ అధికారి. ఆయన సోదరుడే కాకులమర్రి చక్రధర్ రావు. ఇతని కుమారుడు, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావు భార్య శ్రీలత. కాకులమర్రి విజయరామారావు ఉద్యోగ రీత్యా దేశ రాజధాని ఢిల్లీ వరకు ఎదిగినప్పటికీ, ఆయన సోదరుడు చక్రధర్ రావు మాత్రం ఏటూరునాగారంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఏటూరునాగారం తొలి సర్పంచ్ గా పనిచేసిన కాకులమర్రి గోపాల్ రావు కుమారులే విజయరామారావు, చక్రధర్ రావులు. ఆ తర్వాత క్రమంలో చక్రధర్ రావు కూడా ఏటూరునాగారం సర్పంచ్ గా పని చేశారు. ఎటువంటి అవినీతి మరక లేకుండా చక్రధర్ రావు ఏటూరునాగారం సర్పంచ్ గా స్థానిక ప్రజల మన్ననలు అందుకున్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన చక్రధర్ రావు చాలాకాలంపాటు ‘తటస్థం’ (న్యూట్రల్)గానే ఉన్నారే తప్ప, మరే రాజకీయ పార్టీలో చేరలేదు.

చక్రధర్ రావు కుమారుడైన లక్ష్మణ్ రావు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ రావు తన సతీమణి శ్రీలతను సర్పంచ్ ఎన్నికల బరిలోకి దించి విజయం సాధించారు. జనరల్ మహిళలకు పదవి రిజర్వు కావడంతో కాకులమర్రి శ్రీలత సర్పంచ్ గా పోటీ చేసి ‘రికార్డు’ స్థాయి మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారనే చెప్పాలి.

అయితే ఏటూరునాగారంలో గులాబీ పార్టీకి చెందిన అభ్యర్థి సర్పంచ్ గా గెలుపొందడం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తున్న మంత్రి సీతక్క తమ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగానే పాటుపడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇదే అంశంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థికి ధీటుగా కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ఎంపిక జరలేదన్నారు. అంతేగాక కాకులమర్రి లక్ష్మణ్ రావు అత్యంత ముందస్తు వ్యూహంతో వ్యవహరించి తన సతీమణిని గెలిపించుకున్నారని చెప్పారు.

కొసమెరుపు:
కాకులమర్రి శ్రీలత మామ, ఏటూరునాగారం సర్పంచ్ గా పనిచేసిన చక్రధర్ రావు వ్యక్తిత్వం గురించి ఈ సందర్బంగా ప్రత్యేకంగా చెప్పాలి. ఎవరైనా ఓ వ్యక్తి వచ్చి, ‘సార్ నన్ను ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు పిలిచారు, మీరే కాపాడాలి’ అంటే చక్రధర్ రావు స్పందన ఏమిటో తెలుసా? ‘ఎస్ఐగారు ఎందుకు పిలిచారు? నువ్వేం తప్పు చేశావ్?’ అని ఆయన ప్రశ్నిస్తారు. నిన్న రాత్రి తాగిన మైకంలో ఒడికడిని కొట్టాను సర్.. అని ఆ వ్యక్తి సమాధానంగా చెబితే.. ‘తప్పు నీవైపే ఉంది. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తారు. వెళ్లు పోలీస్ స్టేషన్ కు..’ అని చక్రధర్ రావు చెబుతారు. అదీ కాకులమర్రి చక్రధర్ రావు రాజకీయ వ్యక్తిత్వానికి మచ్చు తునక. అతని రాజకీయ వారసురాలిగా ఏటూరునాగారం సర్పంచ్ గా విజయం సాధించిన శ్రీలత కూడా తన మామగారి తరహాలో మచ్చలేని వ్యక్తిత్వానికి తీసిపోని విధంగా వ్యవహరిస్తారని స్థానికులు అభిలషిస్తున్నారు.

✍️ ఎడమ సమ్మిరెడ్డి

