ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఓ ఇంట్లో గుర్తు తెలియిని దుండగులు సంచలన రీతిలో చోరీకి ప్రయత్నించారు. ఓ ఇంటి తలుపులపై పెట్రోల్ పోసి నిప్పటించి చోరీకి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఆ ఇంటి యజమాని అప్పుడే బయట నుంచి తన నివాసానికి చేరుకోవడంతో తన భార్యతోపాటు ఇద్దరు పిల్లలు భారీ అగ్నిప్రమాదపు ఘటన నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఖమ్మం నగరంలోని టూ టౌన్ పరిధిలో గల రాపర్తినగర్-2, బీసీ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే..
బీసీ కాలనీకి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి కుటుంబం ముగ్గు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది. అతని కుమారుడు నాగేశ్వర్ రావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. గత రాత్రి, బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆటో నడుపుకుని ఇంటికి వచ్చిన నాగేశ్వర్ రావుకు తన ఇంటి ముందు ఎగసిపడుతున్న మంటలు కనిపించాయి. తీవ్ర భయాందోళనకు గురైన నాగేశ్వర్ రావు వెంటనే ఆటోను నిలిపి, తలుపు వైపు వెళ్లి చూడగా ద్వారం మంటల్లో తగులబడుతోంది. అప్రమత్తమైన నాగేశ్వర్ రావు సహా అతని కుటుంబ సభ్యులు మంటలను ఆర్పివేశారు.
ఇంటి తలుపులు మంటల్లో దహనమవుతున్న సమయంలో అతని భార్య, ఇద్దరు పిల్లలు అదే ఇంట్లో నిద్రిస్తున్నారు. ఘటన చోటు చేసుకున్న సమయానికి ఆటో నడుపుకుని అప్పుడే నాగేశ్వర్ రావు ఇంటికి చేరుకోవడం, అప్రమత్తమై మంటలను ఆర్పడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డారు. నాగేశ్వర్ రావు రాకను గమనించిన దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని వివరాలు సేకరించారు. దుండగుడు తన చెప్పులు వదిలేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
సాధారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగులగొట్టి, చాకచక్యంగా తాళం తీసి దొంగలు ఇటువంటి ఘటనలకు పాల్పడుతుంటారు. లేదా ఇంట్లోకి ప్రవేశించి కత్తులు, కటార్లతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతుంటారు. ఇందుకు విరుద్ధంగా తలుపులపై పెట్రోలు పోసి ఒడిగట్టిన ఈ దారుణం చోరీ యత్నాల్లో సరికొత్తదిగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే తనకు ఎవరితోనూ వివాదం లేదని, గొడవలు కూడా లేవని, శత్రుత్వం అంతకన్నా లేదని ఇంటి యజమాని నాగేశ్వర్ రావు చెప్పారు. తాను సమయానికి రాకుంటే తన భార్యా, పిల్లల పరిస్థితి ఎలా ఉండేదోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తలుపు వద్ద ఓ పట్టాను ఉంచి, పెట్రోలు పోసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.

