Top 5 This Week

Related Posts

గెరిల్లా యుద్ధ సన్నద్ధతకు ‘ఎన్కౌంటర్’ షాక్!

గెరిల్లా యుద్ధానికి సిద్ధమవుతున్న మావోయిస్టు పార్టీపై ఛత్తీస్ గఢ్ భద్రతా బలగాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఫలితంగా ఆ పార్టికి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలక్రిష్ణ అలియాస్ మనోజ్, కేకేబీఎన్ డివిజన్ కార్యదర్శి అల్వాల్ చంద్రహాస్ అలియాస్ ప్రమోద్ సహా పది మంది మావోయిస్టులు నిన్నటి ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా గడచిన ఏడాది కాలంగా పార్టీకి జరుగుతున్న వరున నష్టాలపై మావోయిస్టు పార్టీ ఇటీవలే లోతైన సమీక్ష నిర్వహించుకుంది. ఇదే అంశానికి సంబంధించి రెండు రోజుల క్రితం ఆ పార్టీ కేంద్ర కమిటీ పది పేజీలతో కూడిన ఓ కీలక లేఖను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

(file photo)

వచ్చే మార్చి నెలాఖరులోపు నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర పాలకులు పదే పదే శపథం చేస్తున్న పరిణాాామాల్లో మావోయిస్టు పార్టీ తన స్థితి, గతులపై లోతైన సమీక్ష చేసుకుందనే చెప్పాలి. కేంద్ర కమిటీ పేరున మొన్న విడుదల చేసిన పది పేజీల సందేశపు లేఖలో మావోయిస్ట్ పార్టీ అనేక అంశాలను అంగీకరిస్తూనే, విప్లవోద్యమంపై నిరాశ చెందకపోవడం గమనార్హం. మావోయిస్టు పార్టీ 21వ స్థాపనా వార్షికోత్సవాల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఈ లేఖలో అనేక అంశాలను ఆ పార్టీ ప్రస్తావించింది.

విప్లవోద్యమంలోని అనూకూలతను వెన్నంటి రహస్య పనివిధానాన్ని అమలు చేయడంలో కొన్ని లోపాటు జరిగినట్లు పార్టీ అంగీకరించింది. ఆ లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా పార్టీని శత్రువుకు అభేద్యంగా తయారు చేసుకోవాలని నిర్దేశించుకుంది. మారిన సామాజిక పరిస్థితికి తగినట్లుగా, తాత్కాలిక వెనుకంజను అధిగమించేలా వర్గపోరాటాన్ని, గెరిల్లా యుద్ధాన్ని నడపడం ద్వారా పార్టీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయని అంచనా వేసింది. చిన్న, వికేంద్రీకృత చర్యల ద్వారా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.

ఇలా అనేక కోణాల్లో సమీక్షించుకున్న మావోయిస్టు పార్టీ పార్టీ కేడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం గమనార్హం. నేటి స్థితిలో, శత్రు ఆధిక్యతను, జరుగుతున్న నష్టాలను మాత్రమే చూసి అవిశ్వాసానికి గురి కావద్దని, అధైర్యపడవద్దని, నిష్క్రియాపరత్వానికి గురికావద్దని కోరింది. అంతేకాదు ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని కూడా మావోయిస్ట్ పార్టీ కోరంది. ప్రజా ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని మరోసారి ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.

గరియాబంద్ ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలక్రిష్ణ అలియాస్ మనోజ్

ఈ పరిణామాల్లోనే మావోయిస్టు పార్టీపై భద్రతా బలగాలు మరోసారి విజయం సాధించాయి. ఛత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లా అడవుల్లో నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఇద్దరు కీలక నేతలు సహా 10 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విజయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని, వచ్చే మార్చి 31వ తేదీలోగా వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

Popular Articles