వాహనాలు నడుపుతున్న మైనర్లకు, వారి తల్లిదండ్రులకు ఖమ్మం పోలీసులు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే 21 మంది మైనర్ డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. కేవలం మైనర్లపైనే కాదు, వారి తల్లిదండ్రులపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తుండడం గమనార్హం. ఇటువంటి ఘటనల్లో మైనర్ల తల్లిదండ్రులకు కోర్టు జరిమానా కూడా విధించింది. ఇటీవల ఖమ్మం నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా, బైకులు నడుపుతూ పట్టుబడిన ఎనిమిది మంది మైనర్ల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసుల్లో నిందితులైన మైనర్ల తల్లిదండ్రులను కోర్టులో హాజరుపర్చగా, ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ 4వ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ (స్పెషల్ మొబైల్) న్యాయమూర్తి జస్టిస్ బి. నాగలక్ష్మి తీర్పు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ, గడచిన 20 రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన 673 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇదే సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడుపుతున్న 21 మంది మైనర్ డ్రైవర్లపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోవడం, ప్రమాదాల బారిన పడడమే కాకుండా కుటుంబాలకు శిక్ష వేసిన వారవుతున్నారని తెలిపారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యల కోసం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ఇప్పటికే పలువురికి ఒక రోజు చొప్పున జైలు శిక్ష/ జరిమానా విధించడం జరిగిందన్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా శని, ఆది వారాలలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో అయా రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇటీవల నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హజరుపరచగా వారికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించినట్లు తెలిపారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, మైనర్లు ఎవరూ కూడా వాహనాలు నడపవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.

