Top 5 This Week

Related Posts

ఆధిపత్య పోరులో మంత్రులు: ఎమ్మెల్సీ కవిత

ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు ఆధిపత్య పోరులో ఉన్నారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన కవిత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ఎటువంటి ప్రయోజనం లేదని, అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా, కనీసం రివ్యూ మీటింగ్ చేసే తీరిక మంత్రులకు లేదన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.

ఇంత జరుగుతున్నా విప్లవాల ఖిల్లా ఖమ్మంలో కామ్రేడ్స్ మౌనం వహిస్తున్నారని కవిత అన్నారు. అధికారంలో ఎవ్వరున్నా ప్రశ్నించే కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రశ్నించడం లేదని, ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించడం లేదని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీరందించామని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టుకూ శ్రీకారం చుట్టలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎటువంటి ప్రయజనం లేదన్నారు.

అకాల వర్షాలతో నష్టపోయిన పంటల గురించి తెలుసుకునే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదని, పంట నష్టం పోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న ములుగు పర్యటనలో ఉన్న మంత్రులు పొంగులేటి, సీతక్కలకు వైద్యం అందక చనిపోయిన శిశువును చూసే తీరిక కూడా లేదని, ఆగి పరామర్శించే ఓపిక కూడా లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయని, కేసీఆర్ హయాంలో పేదలకు మెరుగైన వైద్యం అందించామన్నారు.

తన నివాసానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అదేవిధంగా 60 శాతం మంది రైతులకు రైతు రుణమాఫీ అందలేదని, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇంత వరకు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని కవిత అన్నారు. ఈనెల 27వ తేదీన వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆమె ప్రజలను కోరారు. జిల్లా నుంచి ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కవితి కోరారు.

Popular Articles