శ్రీ విశ్వావసు నామ సంవత్సరం… తెలుగు సంవత్సరం ప్రారంభంగా వ్యవహరించే ఉగాది కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగే ఉగాది. ఈ సారి తెలుగు సంవత్సరాది వరుస సంఖ్య 39వ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అంటే విశ్వానికి సంబంధించినదిగా, ధనసమృద్దిని కలిగించేదిగా పండితుల నిర్వచనం. ఉగ అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు మత్సావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునుండే ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.
ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. సంప్రదాయాలు, సదాచారాలతో పాటూ ఆరోగ్య సూక్తులూ, మానవ జీవన విలువలూ మేళవించిన అపూర్వ సమ్మేళనాలు పండుగలు. తెలుగువారికి ఇష్టమైన పండుగ ఉగాది. కోయిల పాటే ఉగాది. చెట్ల చిగురే ఉగాది. షడ్రుచుల సమ్మేళనపు జీవితపు పరిమళమే ఉగాది. వసంతాగమన వేళ జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది.శిశిరంలో ఆకు రాల్చిన ప్రకృతి. వసంతంలోకి లేత ఆకుపచ్చగా, కొత్త చివుళ్లు వేసి నవ యవ్వనంలా కనిపిస్తుంది. కొత్త పూల నుంచి వీచే పిల్ల గాలికి పక్షులు కిలకిలరావాలతో గిలిగింతలు పెడతాయి. ఓటమివెంటే గెలుపు ఉంటుందని. చీకటివెంటే వెలుగు ఉంటుందని, నమ్మకాన్ని వీడద్దని చెప్పే పండుగ ఉగాది.
శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదే కావడం విశేషం. ఈ రోజు నుండే శాలివాహన శకం ప్రారంభమైందని చెబుతారు. ఉగాదిలోని యుగం అంటే ద్వయం, జంట అని కూడా అర్థం ఉంది. ఉత్తరాయన, దక్షిణాయన అను ద్వయాలు కలిస్తేనే యుగం, సంవత్సరం అవుతుంది. దీనికి ఆది యుగాది. హైందవశాస్త్రం ప్రకారం తెలుగు నామ సంవత్సరాలు అరవై. అవి ప్రతియేడు ఒక క్రమంలో వస్తాయి. ప్రభవ నామ సంవత్సరం నుంచి తెలుగు వత్సరాలు వరుస క్రమంలో అరవై వరకు ఉంటాయి.

