తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పట్ల అదే పాఠశాలకు చెందిన టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ, తన కోరిక తీర్చాలని వేధించడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడిని చితకబాది దేహశుద్ధి చేసిన సంఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి
టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి హిందీ టీచరుగా పనిచేస్తున్నాడు. అదే క్రమంలో వార్డెన్ గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ అశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికను మంగళవారం ప్రతాప్ సింగ్ తన కోరిక తీర్చవలసిందిగా బలవ బలవంతం చేస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాఠశాలకు రాగా, అప్పటికే ప్రతాప్ సింగ్ పారిపోయాడు.

దీంతో ఆగ్రహంతో వెనుతిరిగిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలో ఉన్న ప్రతాప్ సింగ్ ను చూసి వారంతా ఒక్కసారిగా కోపోద్రిక్తులై ఆయన మీద దాడికి పాల్పడి, చితకబాదారు. సమాచారం అందుకున్న ఇల్లెందు ఐటీడీఏ అధికారులు, బోడు పోలీసులు పాఠశాలను సందర్శించి ఘటనా వివరాలు సేకరించారు. ప్రతాప్ సింగ్ పై పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా శాఖా పరమైన చర్యల్లో భాగంగా ప్రతాప్ సింగ్ ను ఐటీడీఏ అధికారులు సస్పెండ్ చేస్తున్నట్లు సమాచారం.

