ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక క్వారీల వివాదం రాజకీయంగా ఏదేని అనూహ్య మలుపునకు దారి తీస్తుందా? ఇదే జరిగితే అధికార పార్టీలో పొలిటికల్ ప్రకంపనలు అనివార్యమవుతాయా? ప్రభుత్వంలో కీలక మంత్రిగా ప్రాచుర్యంలో గల ముఖ్యనేత అనుచరులకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతున్న ఇసుక క్వారీల్లో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాయం ఎంటరై కీలక ఆదేశాలు జారీ చేసినట్లు వస్తున్న వార్తలు ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏమిటా ఇసుక క్వారీల దందా? గోదావరి నది కేంద్రంగా ఏర్పడిన ఈ వివాదం పొలిటికల్ గా టర్న్ తీసుకునే అవకాశముందా? అనే ప్రశ్నలపై భిన్న చర్చ జరుగుతోంది.
భద్రాద్రి జిల్లాలో ఇసుక మాఫియాపై సీఎం రేవంత్ ఉక్కు పాదం మోపారని, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పరిధిలో గల 17 ఇసుక క్వారీల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని సీఎంవో నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని, నోటి మాటగా మాత్రమే క్వారీల్లో ఇసుక తీయడాన్ని నిలిపివేయాలని ఆదేశాలు వచ్చినట్లు అధికార వర్గాలు ‘ఆఫ్ ది రికార్డు’గా చెబుతున్నాయి. ఇంతకీ ఏమిటీ 17 ఇసుక క్వారీల కథా కమామీషు..? అనే వివరాల్లోకి వెడితే..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భద్రాద్రి జిల్లాలో గోదావరి నది వెంటగల భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పరిధిలో గల 17 ఇసుక క్వారీలను ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి అనుచరులకు కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఏజెన్సీ ఏరియాలో ఇసుక క్వారీల నిర్వహణ రికార్డుల పరంగా గిరిజన సంఘాలదే అయినప్పటికీ, పెత్తనమంతా రెయిజింగ్ కాంట్రాక్టర్లదేననే విషయం బహిరంగమే. తెలంగాణాలోని గోదావరి నది వెంట గల ఇసుక క్వారీల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెయిజింగ్ కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గల ఇసుక వ్యాపారంలో 80 శాతం మంది రెయిజింగ్ కాంట్రాక్టర్లు ఏపీకి చెందినవారేనని అధికార వర్గాలే అన్యాపదేశంగా అంగీకరిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రంలో ఏడాది క్రితం అధికార మార్పిడి జరిగిన తర్వాత సహజంగానే బీఆర్ఎస్ నాయకుల చేతి నుంచి ఇసుక క్వారీలు కాంగ్రెస్ నాయకుల హస్తగతమైనట్లు వార్తలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పరిణామాల్లోనే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తన అనుచరులకు మాత్రమే ఇసుక క్వారీలను కట్టబెట్టారనేది తాజాగా వచ్చిన వార్తల సారాంశం. నియమ, నిబంధనల సంగతి ఎలా ఉన్నా, మంత్రి వాట్సప్ మెసేజ్ ద్వారా వెళ్లిన పేర్లను ఖరారు చేస్తూ అధికార వర్గాలు ఇసుక క్వారీలు కేటాయంచారనేది మరో ప్రచారం. ఈ పరిణామాల్లోనే మంత్రి అనుచరులకు కేటాయించినట్లు పేర్కొంటున్న 17 ఇసుక క్వారీల్లో కార్యకలాపాలను ఉన్నఫళంగా నిలిపివేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు అందినట్లు వార్తలు వచ్చాయి.

నిజానికి ప్రతి ఇసుక క్వారీలో లక్ష క్యూబిక్ మీటర్ల లోపు మాత్రమే ఇసుకను తవ్వుతారు. ఒక్కో క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ. 640 చొప్పున ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంటుంది. ప్రతి క్వారీ నుంచి ప్రతి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ. 6.40 కోట్ల మొత్తం జమ అవుతుంది. ఇందులో నుంచి రూ. 2.30 కోట్ల మొత్తం రెయిజింగ్ కాంట్రాక్టర్ చేతికి వస్తుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుతం సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చిన ఇసుక క్వారీల్లో సుమారు 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విలువ అక్షరాలా రూ. 100 కోట్ల పై మాటే. ఈ క్వారీలే కేంద్రాలుగా సాగే ‘జీరో’ దందా లెక్కలు వేరే ఉంటాయి. అయితే కేవలం మంత్రి అనుచరులకు మాత్రమే క్వారీలు దక్కాయనే ఆరోపణలు, విమర్శల నేపథ్యంలోనే సీఎంవో ఇసుక క్వారీల వ్యవహారంలో ఎందుకు ఎంటరైంంది? కేవలం మంత్రి అనుచరులకు క్వారీలు దక్కడమేనా? ఇతరత్రా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే అంశంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
ఇసుక క్వారీల్లో వివిధ దశల్లో జరిగే ‘లాంఛనాల’ ప్రక్రియలో తేడా వచ్చిందా? లేక తమ అనుయాయులకు క్వారీలు దక్కలేదనే కారణంతో ఇతర ముఖ్య నాయకులెవరైనా సీఎంవో నుంచి ఈ ఆదేశాలు ఇప్పించారా? అనే ప్రశ్నలతో కూడిన పొలిటికల్ చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో ప్రచారం కూడా వ్యాప్తిలోకి రావడం గమనార్హం. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి ఒకరు నేరుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు జాతీయ నాయకులతో సంబంధాలను ఇటీవలి కాలంలో బలోపేతం చేసుకున్నారనేది ఈ ప్రచారపు సారాంశం. ఈ మంత్రికి వ్యతిరేకంగా ఇటీవల పది మంది వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించిన పరిణామాల వెనుక ఇటువంటి రాజకీయ కారణాలు అనేకం ఉన్నట్లు అధికార పార్గీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇసుక విధానాన్నే మార్చేందుకు కీలక మంత్రి ఒకరు ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన ఇసుక విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రవేశపెట్టేందుకు ఈ మంత్రి ప్రతిపాదిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ఒకరిద్దరితో ఈ అంశంలో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు కూడా జరుగుతున్న ప్రచారంలో ఓ భాగం. ఆయా పరిణామాల్లోనే 17 ఇసుక క్వారీల అంశంలో సీఎంవో కార్యాలయం జోక్యం చేసుకుందని అంటున్నారు. మొత్తంగా పరిశీలించినపుడు భద్రాద్రి జిల్లాలో ఈ కీలక మంత్రి అనుచరులకు దక్కినట్లు ప్రచారంలో గల ఇసుక క్వారీల్లో మాత్రమే సీఎంవో జోక్యం చేసుకుని ఉక్కుపాదం మోపినట్లు వార్తలు రావడం గమనార్హం. భద్రాద్రి జిల్లాను మినహాయిస్తే ఎగువన గల ములుగు, భూపాలపల్లి వంటి జిల్లాల్లో గోదావరి నది వెంట గల ఇసుక క్వారీల్లో కార్యకలాపాలు యథావిధిగా సాగుతుండడం విశేషం. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు 17 ఇసుక క్వారీల వ్యవహారం పొలిటికల్ టర్న్ కు దారి తీస్తుందా? అనే అంశంపై రాజకీయ చర్చ జరుగుతోంది.

