కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ గా స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వ్వవహార శైలిపైనేగాక కేటీఆర్, హరీష్ రావుల తీరుపైనా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలకు ధీటైనా సమాధానమిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ దేనని సీఎం అన్నారు. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో వేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమేనని, ఇందులో మిత్తి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమేనని, కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ. 21వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు.

తాము రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫాం హౌస్ కు వచ్చినోళ్లకు సోది చెప్పుడేందని వ్యాఖ్యానిస్తూ, అసెంబ్లీకి రా లెక్కలు చెబుతామని సవాల్ విసిరారు. రైతుల జాబితాతో సహా చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తామని, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు పిలుపునిచ్చారు. కేసీఆర్ లాగా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర తనది కాదన్నారు.
’’ఆయన గంభీరంగా చూస్తున్నడట…ఎవరిని చూస్తున్నావ్? అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరిమీదకు వదిలిండు. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసినవ్.. పాలమూరును ఎండబెట్టిన దుర్మార్గుడు కెసిఆర్, మాప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసానూ ఇస్తున్నం, మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తాం, భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ. 12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం, మొదటి ఏడాదిలోనే 55,142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తన నాయకత్వంపై కేసీఆర్ కు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావాలని, కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడటం నేర్చుకోవాలన్నారు. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటుండని, పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటుండు అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ ముందు తన కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకోవాలని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నామని, పొంఖనాలు కొట్టుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందామని సవాల్ చేశారు. ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయిందని, కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు అని, మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకోవాలని కేసీఆర్ ను ఉద్ధేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

