Top 5 This Week

Related Posts

ప్రపంచంలో ఉన్నవే ఏడు కథలట!.. రౌండ్ ఫిగర్ చేస్తే..!!

సినిమా రివ్యూల్లో బాగా అరిగిపోయిన పదం ‘కథలో కొత్తదనం లేదు’!.

ఏమిటసలు కథలో కొత్తదనం!

ఎప్పుడో 1957లో ఒక ఫ్రెంచ్​ మహిళ రాసిన ఇంగ్లిష్​ నవల.

గడచిన 70 ఏళ్లుగా మొత్తం మన దేశ సినీ ఇండస్ట్రీనే ఊపేస్తోంది. ప్రతి భాషలోనూ కనీసం మూడు సార్లు సినిమాగా వచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ‘wood’ల్లోనూ హిట్ కొట్టింది. స్టార్​లను సూపర్ స్టార్​లుగా మార్చేసింది. కొత్త ఇమేజ్​ కల్పించి, ఫ్యాన్స్​ని ఉర్రూతలూగించింది. ‘wood’ల స్టామినా పెంచింది. బ్యానర్లను నిలబెట్టింది. ఎన్ని సార్లు తీసినా మ్యూజికల్ హిట్ అయ్యింది!

కథ చాలా సింపుల్, సింగిల్ లైన్ స్టోరీ. ‘ఒకేలా అనిపించే ఇద్దరు వ్యక్తులు ఒకడి స్థానంలోకి మరొకడు వెళ్లి… మొదటివాడి నిర్వాకాల్ని చక్కదిద్ది శుభం కార్డు వేయడం’. ఇదే కథ!

ఈ కథతో ఎంజీఆర్ అయిదారు సినిమాలు (నాడోడి మన్నన్, కుడియిరుంద కోయిల్, నినైత్తదై ముడిప్పవన్, ఊరుక్కు ఉళైప్పవన్. ఎంగ వీట్టు పిళ్లై), ఎన్టీఆర్ నాలుగైదు సినిమాలు (భలే తమ్ముడు, గండికోట రహస్యం, రాముడు భీముడు, యుగంధర్), అజిత్ రెండు సినిమాలు (బిల్లా–1, బిల్లా–2), అక్కినేని ఒక సినిమా (ఇద్దరు మిత్రులు) చేశారు.

సాఫ్ట్ హీరోలుగా మంచి పేరు గడించిన ఉత్తమ్ కుమార్, షమ్మీ కపూర్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్, షారూఖ్ ఖాన్, ప్రభాస్… ఇత్యాది నటులందరినీ మార్చేసింది. మాస్ యాక్షన్ హీరోలుగా తయారు చేసింది.

ఆ నవల పేరు ‘ది స్కేప్ గోట్’, రచయిత్రి పేరు డఫ్నీ డ్యు మోరియే (Daphne du Maurier). ఫ్రెంచ్ పేరు.

నవల కథాంశం :
ఇంగ్లాండులో ఫ్రెంచ్ బోధించే జాన్ అనే ఫ్రొఫెసర్ సెలవుల్లో ఫ్రాన్స్ దగ్గర ఓ పట్టణానికి వెళ్తాడు. అక్కడ అచ్చంగా తనలాగే ఉండే జీన్ అనే పారిశ్రామికవేత్తను కలుస్తాడు. ఇద్దరూ ఒకరి సోది మరొకరికి వినిపించుకుంటారు. అప్పటి వరకు ‘ఎందుకొచ్చిన బతుకురా బాబూ’ అన్నట్లుగా ఉదాసీనంగా, నిరాశావహంగా ఉండే జాన్… జీన్ సంపన్న జీవితంలోని సంక్లిష్టతను, అతని భార్య, బంధువుల గురించి, పరిశ్రమలో ఒడిదుడుకుల గురించి తెలుసుకుని చలించిపోతాడు. ఆ రాత్రి జీన్–జాన్ అటు ఇటు మారిపోతారు. చివరాఖరికి అన్నీ సెటిల్ అవుతాయి.

మీకు మరిన్ని సినిమాలు గుర్తుకు రావచ్చు.

మూల కథలో దమ్ము ఉంటే… దాని చుట్టూ అనేక హంగు ఆర్భాటాలు కల్పించవచ్చు. జుత్తున్న మహిళ ఎన్ని ముడులైనా వేసుకోవచ్చు అన్నట్లుగా!

====

Ps : ప్రపంచంలో ఉన్నవే ఏడు కథలట! క్రిస్టొఫర్ బుకర్ (Christopher Booker) అనే ఔత్సాహికుడు 34 ఏళ్లపాటు శోధించి మరీ తేల్చారు. అబ్బే కాదు, తొమ్మిది కథలన్నారు కొందరు. సరే, రౌండ్ ఫిగర్ చేసి, పది కథలనుకుందాం.

వీటినే కథన కుతూహలంతో సినిమాలు తీసి హిట్లు కొడతారు. మరికొందరు చప్పటి కథనంతో, నత్తనడకతో, రాంగ్ క్యాస్టింగ్​తో రీళ్లు చుట్టేసి చతికిలపడుతుంటారు.

Popular Articles