Top 5 This Week

Related Posts

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు

  • 20 యూనిట్లలో తనిఖీలు.. రూ.5.89 లక్షల విలువైన 5,555 కిలోల ఆహార పదార్థాలు సీజ్
  • తొమ్మిది తయారీ కేంద్రాల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు సస్పెండ్‌..
  • తక్షణమే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు

హైదరాబాద్‌: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు ఆహార తయారీ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని 20 ఆహార తయారీ, ప్రాసెసింగ్ యూనిట్లలో ఈ నెల 29న తనిఖీలు చేపట్టారు. టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన 10 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

మసాలా దినుసులు, వంట నూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, పానీయాలు తదితర ఆహార పదార్థాలను తయారు చేసే యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కేంద్రాల్లో అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు.

తయారీకి ఉపయోగిస్తున్న యంత్రాలు తుప్పు పట్టి అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, తప్పుగా లేబులింగ్ చేసిన ఉత్పత్తులను గుర్తించారు. పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఉద్యోగుల ఆరోగ్య వివరాలు, ఆహారం, నీటి నాణ్యత పరీక్షల నివేదికలు వంటి తప్పనిసరి పత్రాలు నిర్వహించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను నేలపై నిల్వ చేయడం, ఆహారేతర వస్తువులతో కలిపి ఉంచడం, తయారీ, నిల్వ ప్రాంతాల్లో చెత్తాచెదారం, సాలెగూళ్లు ఉండటం వంటి లోపాలు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి.

ఆహార పదార్థాల్లో పురుగుల ఉనికి, బొద్దింకలు, దోమలు, ఈగలు, ఎలుకల విసర్జితాలు కనిపించాయని అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలను నిర్వహించే సిబ్బంది హెయిర్‌నెట్‌లు, అప్రాన్లు, గ్లౌజులు వంటి రక్షణ పరికరాలు ధరించకపోవడం, ఆహార రవాణా వాహనాలు తుప్పు పట్టి అపరిశుభ్రంగా ఉండటం వంటి ఉల్లంఘనలను గుర్తించారు.

రూ.5.89 లక్షల ఆహార పదార్థాలు స్వాధీనం:

తనిఖీల్లో కల్తీ అనుమానంతో మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 5,555 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, తొలగించారు. వీటి విలువ రూ.5,89,550గా అధికారులు వెల్లడించారు.

తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని తిమ్మాపూర్‌లోని లక్ష్మీ ఫుడ్స్‌, వరంగల్‌లోని శివతార ఫ్లోర్ మిల్ సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు. తిరిగి తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలును పరిశీలించనున్నారు.

అలాగే తొమ్మిది సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటిలో రంగారెడ్డి జిల్లాలోని గంగా ఫుడ్ టెక్ అండ్ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జీపీఆర్ ఫుడ్స్ (సెంట్రల్ యూనిట్), హెల్తీ హార్ట్ ఫుడ్స్, వర్షా స్పైసెస్, వరంగల్ జిల్లాలోని కరాణి స్పైసెస్, మిఠాయివాలా, బెల్ బ్రాండ్; హనుమకొండ జిల్లాలోని స్వాగత్ స్వీట్స్, మార్లూస్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. వీటిపై తదుపరి చర్యల్లో భాగంగా జరిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.

తొమ్మిది సంస్థల లైసెన్సులు సస్పెండ్‌:

తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించిన తొమ్మిది తయారీ కేంద్రాల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

లైసెన్సులు సస్పెండ్ అయిన సంస్థలు:

  1. హరి ప్రియా ప్రొడక్ట్స్‌, వరంగల్: తుప్పు పట్టిన యంత్రాలు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తప్పనిసరి రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, అల్లంలో బూజు, సరైన గాలి ప్రసరణ లేకపోవడం, గోడలు, పైకప్పులు అపరిశుభ్రంగా ఉండటం.
  2. దయానంద్ ఐస్‌క్రీమ్స్‌, వరంగల్: లేబుల్స్ లేని ఐస్‌క్రీమ్ బాక్సులు, ఫ్రిజ్‌లో గడువు ముగిసిన పాల ప్యాకెట్, బహిరంగ డ్రైనేజీ, జారుడుగా ఉన్న నేల, తుప్పు పట్టిన పాత్రలు, అపరిశుభ్రమైన కోల్డ్ స్టోరేజ్, నీటి నిల్వలు, సిబ్బంది రక్షణ పరికరాలు ధరించకపోవడం.
  3. రాజు నెయ్యి స్వీట్ హౌస్ కంపెనీ, వరంగల్: కార్మికులు అప్రాన్లు, గ్లౌజులు ధరించకపోవడం, వైద్య, పెస్ట్ కంట్రోల్, నీటి పరీక్షల రికార్డులు లేకపోవడం, కాస్మెటిక్ గ్రేడ్ డాబర్ గులాబారీ ఉత్పత్తిని వినియోగించడం, చనిపోయిన చీమలు, దోమలు కనిపించడం, మురుగునీటి కాలువ సమీపంలో స్వీట్ల తయారీ, తుప్పు పట్టిన నిల్వ ర్యాకులు, కంటైనర్లు.
  4. శ్రీకృష్ణ ఆయిల్ మిల్స్‌, వరంగల్: పెస్ట్ కంట్రోల్, కార్మికుల వైద్య పరీక్షలు, ఉత్పత్తుల రీకాల్ రికార్డులు లేకపోవడం, తుప్పు పట్టిన ఆయిల్ ట్యాంకులు, దుమ్ము పట్టిన నూనె డ్రమ్స్‌, తప్పుగా లేబులింగ్ చేసిన ప్యాకేజింగ్, నేలపై ఆహార పదార్థాల నిల్వ, తుప్పు పట్టిన నూనె డబ్బాలు, కిటికీలకు కీటక నిరోధక జాలీలు లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు.
  5. రమేష్ ఇండస్ట్రీస్‌, మట్టెవాడ, వరంగల్: తుప్పు పట్టిన, అపరిశుభ్రమైన యంత్రాలు, సరైన గాలి, వెలుతురు లేకపోవడం, ఆహార, ఆహారేతర పదార్థాల నిల్వలో విభజన లేకపోవడం, సిబ్బంది ఆరోగ్య రికార్డులు, పెస్ట్ కంట్రోల్ వివరాలు లేకపోవడం, కార్మికులు తగిన రక్షణ దుస్తులు ధరించకపోవడం. ఇక్కడ రూ.5,41,250 విలువైన 5,045 కిలోల ఆహార పదార్థాలను తప్పుగా లేబులింగ్ చేసిన కారణంగా స్వాధీనం చేసుకున్నారు.
  6. జియాన్ ఫుడ్ ప్రొడక్ట్స్‌ (వెల్ మార్క్‌), వరంగల్: పైకప్పు, తలుపులపై పెయింట్ ఊడిపోవడం, వాషింగ్ ఏరియాలో నీరు నిల్వ ఉండటం, కిటికీలకు కీటక నిరోధక జాలీలు లేకపోవడం, తుప్పు పట్టిన ఆహార నిల్వ పాత్రలు, తగినంత వెలుతురు, గాలి ప్రసరణ లేకపోవడం, చేతులు కడుక్కునే సదుపాయాలు సరిగా లేకపోవడం, ఎలుకల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు, విసర్జితాలు కనిపించడం.
  7. శ్రీ ఎస్‌ఎంపీ డెయిరీ, చటాన్‌పల్లి, షాద్‌నగర్‌: పెస్ట్ కంట్రోల్, ఉద్యోగుల ఆరోగ్య రికార్డులు, కోల్డ్ రూమ్ ఉష్ణోగ్రత వివరాలు లేకపోవడం, గడువు ముగిసిన రసాయనాలు, కట్టెల నిల్వ, ఈగల బెడద.
  8. కపిల్ ఫుడ్స్‌, హనుమకొండ: తగినంత వెలుతురు లేకపోవడం, వంట ప్రాంతంలో నూనె, మురికి పేరుకుపోవడం, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవడం, ఉపయోగించిన నాలుగు లీటర్ల వంట నూనెను పారవేయడం, తప్పనిసరి రికార్డులు లేకపోవడం, ముడి పదార్థాల్లో పురుగుల ఉనికి.
  9. కృపా బేకరీ ప్రొడక్ట్స్‌, గొర్రెకుంట, వరంగల్: తయారీ, నిల్వ, ప్యాకింగ్ ప్రాంతాలన్నింటిలో సాలెగూళ్లు, ఆహార, ఆహారేతర వస్తువులను కలిపి నిల్వ చేయడం, కప్‌కేకుల తయారీలో ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్ వినియోగం, సిబ్బంది ఆరోగ్య, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడం, పాడైన నేలపై నీరు నిల్వ ఉండటం, దెబ్బతిన్న కీటక నిరోధక తెరలు.

ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని టీజీ సేఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. తనిఖీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా మీడియాకు విడుదల చేశారు.

Popular Articles