Top 5 This Week

Related Posts

ఎమ్మెల్సీ ఎన్నికలు: మంత్రి తుమ్మల కీలక పిలుపు


ఖమ్మం: నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకనేందుకు అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

ఖమ్మం నగరంలోని చర్చ్ కాంపౌండ్, గాంధీ చౌక్, నూతన మున్సిపాలిటీ కార్యాలయం, రోటరీ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను మంత్రి తుమ్మల శుక్రవారం పరిశీలించి ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని పట్టభద్రులకు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ, ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు ఆటోమేటిక్‌గా కొనసాగదన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మరోసారి తప్పనిసరిగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం కొత్తగా ఓటరు జాబితాను రూపొందిస్తున్నందున ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని అర్హులైన పట్టభద్రులందరూ నవంబర్ 6వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుకు డిగ్రీ సర్టిఫికెట్ జతచేయాలని, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో లేదా బూత్ స్థాయి అధికారుల వద్ద దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరు జాబితాలో మన పేరు ఉండేలా చూసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పట్టభద్రుడు బాధ్యతగా ఓటరు నమోదులో పాల్గొని, ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు

Popular Articles