ఖమ్మం: సర్పంచ్ గా పనిచేసిన అధికార పార్టీ గ్రామ స్థాయి నాయకుడొకరు పెండింగ్ బిల్లుల చెల్లింపుకోసం ‘ప్రజావాణి’ని ఆశ్రయించిన ఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగింది. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’ నిర్వహిస్తుంటారు. జిల్లా కలెక్టర్ ప్రజల దరఖాస్తులను స్వీకరిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామ మాజీ సర్పంచ్, స్థానిక కాంగ్రెస్ నేత బొబ్బిలి భరత్ చంద్ర ‘ప్రజావాణి’ని ఆశ్రయించడం గమనార్హం. తన పదవీ కాలంలో గ్రామ పంచాయతీలో నిర్వహించిన అభివృద్ధి పనులకు సంబంధించి తనకు పంచాయతీ నుంచి 17 లక్షల 3 వేల 450 రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, వీటిని త్వరగా చెల్లించాలని కోరుతూ భరత్ చంద్ర ‘ప్రజావాణి’లో దరఖాస్తు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ పరిశీలించి అక్టోబర్ 10వ తేదీ నాటికి విచారణ నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు.

పెండింగ్ బిల్లుల మంజూరుకోసం అధికార పార్టీ నాయకుడే ‘ప్రజావాణి’ని ఆశ్రయించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. తాను రెండుసార్లు హస్నాబాద్ పంచాయతీకి సర్పంచ్ గా పని చేశానని, తన బిల్లులను మంజూరు చేయడం లేదని, అందువల్లే ‘ప్రజావాణి’ని ఆశ్రయించి దరఖాస్తు చేసినట్లు భరత్ చంద్ర చెప్పారు. బిల్లులు మంజూరు చేయాలని ఎంపీడీవో చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

