భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

మిథిలా స్టేడియంలో శ్రీ రామచంద్రస్వామి, సీతమ్మ వారికి పూజా కార్యక్రమం, అలంకరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించి పెళ్లి కొనసాగించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలను నిర్వహించారు.

భద్రాచలం ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించగా, భక్తుల రాక పోకలతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, అన్న ప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకున్నారు.

కాగా అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించు కున్నారు. అనంతరం ఆలయం వద్ద రూ. 351 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పలువురు న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి. రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

