అది 2011 సంవత్సరం.. ‘సాక్షి’ పత్రికకు విజయవాడ బ్యూరో చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నెల, తేదీ గుర్తు లేదుగాని.. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ హోదాలో గల సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఓరోజు ఫోన్ కాల్. ‘ఈరోజు ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ చూశావా? దానిపై నీ అభిప్రాయం ఏమిటి? ఎలా ఉంది? జనం ఏమనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు అడిగారు. పనిచేసే పత్రికనేగాదు, పోటీ పత్రికలను కూడా చదివే అలవాటు గల నేను మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో గల ఆ ఎడిటోరియల్ ను అప్పటికే చదివాను. సాధాణంగా మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో ‘సైన్డ్ ఎడిటోరియల్’ ప్రచురిస్తుంటారు. కానీ అది సైన్డ్ ఎడిటోరియల్ కాదు. ఎవరి సంతకమూ లేకుండా ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేసిన ఎడిటోరియల్ లాంటి ఓ ఖండన. ఓ అంగ్ల పత్రిక ‘సాక్షి’ గురించో, వైఎస్ జగన గురించో ప్రచురించిన వార్తకు కౌంటర్ లాంటి సంపాదకీయం అన్నమాట.
ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల ప్రశ్నలకు సమాధానం చెప్పాలిగా? నా అభిప్రాయంతో పనేముంది సార్.. పెద్దవాళ్లు రాసిన ఎడిటోరియల్ పై నేనేం చెప్పగలను? అని అన్నాను. ‘చెప్పవయ్యా.. నువ్వు నిర్మొహమాటంగా చెబుతావని అడిగాను’ అనే సరికి చెప్పక తప్పలేదు. ‘సర్.. నా ఫీలింగ్ మాత్రమే చెబుతాను. మీరు ఏమీ అనుకోవద్దు’ అన్నాను. ‘సరే చెప్పు..’ అన్నారు ఆయన. ‘సర్..ఆ ఇంగ్లీష్ పత్రికవాడు రాసిన వార్త ఎంత మంది తెలుగు పాఠకులు చదివారో, మన రాష్ట్రం (అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో ఆ పత్రిక సర్క్యులేషన్ ఎంత? ఇంగ్లీష్ మీడియంలో పీజీ చేస్తే తప్ప అర్థంకాని ఆ పత్రిక భాష కథనం ఎంతమందికి అర్థమై ఉంటుందో తెలియదుగాని, పన్నెండు లక్షల సర్క్యులేషన్ గల మన పత్రిక ద్వారా ఆ పత్రిక ఏం రాసిందనే విషయాన్ని మనమే ఎక్కువ మందికి చెప్పగలిగాం సర్..’ అన్నాను నేను. ‘ఔను కదా.. నిన్న ఎడిటోరియల్ మీటింగులో ఒక్కరూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదే..!’ అంటూ సజ్జల ఫోన్ కట్ చేశారు. అంత మాత్రాన నేనేదో తెలివైనవాడినని, ఎడిటోరియల్ బోర్డులో గల పెద్దలను తక్కువ చేసే ఉద్ధేశం ఏమాత్రం కాదిది. ఆ ఎడిటోరియల్ ను చదివిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయాన్ని మాత్రమే నేను వ్యక్తం చేశాను. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ పత్రిక ‘సాక్షి’ ఆఫీసుకు తెప్పించరు.. ప్రత్యేకంగా తెప్పించుకుని దాన్ని నేను చదవలేదు కాబట్టి.. సజ్జల అడిగిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానం అది. ఇప్పుడీ అంశాన్ని ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే.. అదే అసలు ట్విస్ట్?

‘ఇండిగో’ విమానాల ‘కత’ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో తాను నిర్వహించిన డిబేట్ లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి ఏపీ మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయమూ విదితమే. ఆర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నకు దీపక్ రెడ్డి అనే టీడీపీ అధికార ప్రతినిధి స్పందిస్తూ చెప్పిన సమాధానమే ఈ రచ్చకు కారణం. ‘మంత్రి నారా లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఎమర్జెన్సీ వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు’ అని కూడా దీపక్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆర్నబ్ గోస్వామి తన సహజ ధోరణిలోనే గొంతు చించుకుంటూ ‘Who is Lokeash?’ అని ప్రశ్నించారు. నారా లోకేష్ పౌర విమానయాన శాఖ మంత్రా? ఏ హోదాలో ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్నారు?’ అనే సారాంశంతో గల ప్రశ్నలను సంధిస్తూ గట్టిగా కేకలు వేశారు. ఇలా ఆర్బబ్ గోస్వామి, దీపక్ రెడ్డిల మధ్య సాగిన సంభాషణలపై టీడీపీ వ్యతిరేక వెబ్ సైట్లు, మీడియా సంస్థలు సహజంగానే ‘పండుగ’ చేసుకున్న తరహాలో వార్తా కథనాలను ప్రచురించాయి.

టీడీపీ, చంద్రబాబు పొడగిట్టని, జగన్ అనుకూల వెబ్ సైట్లయితే రెచ్చిపోయి మరీ విషయాన్ని రచ్చ రచ్చ చేశాయి. ‘ఫాఫం.. దీపక్ రెడ్డి తన పరువు కాదు, లోకేష్ పరువును దేశవ్యాప్తంగా బజారుపాలు చేశాడు లోకేష్ కు ఎలివేషన్ ఇవ్వబోయి భంగపడ్డాడు’అని కూడా కొన్ని వెబ్ సైట్లు తమ వార్తా కథనాల్లో వ్యాఖ్యానించాయి. అవకాశం దొరికిందే తడవుగా జగన్ అనుకూల, టీడీపీ వ్యతిరేక భావనను వ్యక్తం చేసే ఇటువంటి సైట్లు అటువంటి వార్తా కథనాలు రాయడం ఆశ్చర్యం కాకపోవచ్చు. అర్నబ్ అడిగినదాంట్లో ‘లోకేష్ పరువు’ పోయిందేమిటో ఈ తరహా వార్తా కథనాలు రాసినవాళ్లకే తెలియాలనేది వేరే విషయం. కానీ టీడీపీకి నిత్య భజన చేస్తున్నట్లు ప్రాచుర్యంలో గల మీడియా సంస్థలు చేసిందేమిటి?

రిపబ్లిక్ టీవీ నిర్వాహకుడు ఆర్నబ్ గోస్వామిని టార్గెట్ చేస్తూ ఏబీఎన్ లో వెంకటకృష్ణ, టీవీ5లో మూర్తి, మహాన్యూస్ లో వంశీ అనే జర్నలిస్ట్ కమ్ యాంకర్లు చేసిన డిబేట్ల రచ్చే ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీయడం విశేషం. ఆయా డిబేట్లలో పాల్గొన్నవారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రక్రియలో ఏబీఎన్, టీవీ5, మహాన్యూస్ వంటి న్యూస్ ఛానళ్లలో ఈ అంశంపై జరిగిన చర్చలను చూస్తే ‘ఇంతకీ మంత్రి లోకేష్ పరువు’ తీసింది ఎవరు?’ అనే ప్రశ్న తలెత్తకమానదు. ఎందుకంటే ఆర్నబ్ గోస్వామి నడిపే రిపబ్లిక్ టీవీకి తెలుగు రాష్ట్రాల్లో గల వీక్షకుల సంఖ్యను, ఏబీఎన్, టీవీ5 వంటి ఛానళ్లకు గల ‘వ్యూయర్ షిప్’ను బేరీజు వేసినపుడు ఈ అనుమానం కలగడం సహజం. తన ఛానల్ ను టీడీపీ బాయ్ కాట్ చేసిందనే అంశంపైనా రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి రియక్టవుతూ, ‘నో ఇంపాక్ట్’ అని వ్యాఖ్యానిస్తూ, డిబేట్ లో ఓ ఖాళీ కుర్చీని చూపిస్తూ టీడీపీ వాళ్లు ఎవరూ రాలేదని ప్రస్తావించడం గమనార్హం.

ఇప్పుడు చెప్పండి.. ఆర్నబ్ గోస్వామి నిర్వహించిన డిబేట్ లో మంత్రి లోకేష్ పరువు పోయిందా? ‘యెల్లో మీడియా’ నిర్వహించిన డిబేట్ల కారణంగా విషయం ఎక్కువ రచ్చగా మారిందా? ఓహో.. రిపబ్లిక్ టీవీ అనే ఛానల్ లో ఇటువంటి డిబేట్ ఒకటి జరిగిందా? అందులో ‘లోకేష్ ఎవరు?’ అంటూ ఆర్నబ్ గోస్వామి ప్రశ్నించాడా? అందువల్ల ‘యెల్లో మీడియా’ ఈ డిబేట్లను నిర్వహిస్తూ కౌంటర్ చేస్తోందా? అనే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లోని కోట్ల మంది ప్రేక్షకుల్లో తలెత్తడం సహజం కాదా? ఆయా సంస్థలను ‘యెల్లో మీడియా’ అని నేను అనడం లేదు.. ఏబీఎన్ ఛానల్ లో వెంకటకృష్ణ నిర్వహించిన మరో డిబేట్ లోనే టీడీపీ నాయకుడు (దీపక్ రెడ్డే కాబోలు) వ్యాఖ్యానించడం గమనార్హం.

‘పోయి పోయి లోకేష్ ను సూప్ లో పడేశారేంటండి మీరు.. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ?’ అని వెంకటకృష్ణ దీపక్ రెడ్డిని ఉద్ధేశించి ప్రశ్నిస్తాడు. వీళ్లందరికీ, యెల్లో బ్యాచ్ అంతటికీ థాంక్స్ చెప్పాలి. ఎంత లోకేష్ గారిని కలవరిస్తా ఉన్నారో.. లోకేష్ గారు ఎక్కడో అమెరికాలో ఉంటె గూడ.. అసలు రెండు రోజులు ఇదే పని.. ఆంధ్ర రాష్ట్రంలో.. అని చెబుతుండగా, ఏ బ్యాచ్ అన్నారు? అని మళ్లీ వెంకటకృష్ణ ప్రశ్నిస్తాడు. అక్కడ ఉండే సమస్యను పక్కనబెట్టేసి, ఎంత సేపు లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ, మమ్మల్ని తక్కువ చేసి చూపించాలని చెప్పి, ఎంత పకడ్బందీగా వీళ్లు చేస్తున్నరు.. ఈ యెల్లో మీడియా’ అని దీపక్ రెడ్డి చెప్పుకుంటూ వెడుతుండగా, ‘అది ఓకే.. మీరు యెల్లో బ్యాచ్ అంటున్నారు.. యెల్లో మీడియా అంటున్నారు’ అని వెంకటకృష్ణ దీపక్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న వీడియో క్లిప్ నకు అనుసంధానంగా కమెడియన్ బ్రహ్మానందం కిలాకిలా నవ్వుతున్న ట్రోలింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అటు టీవీ5, మహాన్యూస్ ఛానళ్ల డిబేట్ల క్లిప్పింగులతోనూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.
మొత్తంగా ఈ కథనంలో తొలుత ప్రస్తావించిన ‘సాక్షి’ ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ కు, ప్రస్తుతం ఆర్బబ్ గోస్వామి డిబేట్ లో ‘లోకేష్ ఎవరు?’ అనే ప్రశ్న ప్రామాణికంగా ‘యెల్లో మీడియా’లో జరుగుతున్న డిబేట్లలో రచ్చ టైపు చర్చకు సారూప్యత ఉన్నట్లు కనిపించడం లేదూ! మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అదేదో సినిమాలో రాసిన డైలాగ్ కు కాస్త అటూ.. ఇటూగా చెప్పాల్సి వస్తే.. ‘ఆర్నబ్ గోస్వామి’లు ఎక్కడో ఉండరు.. ‘యెల్లో మీడియా’ రూపంలో టీడీపీ చుట్టూ, లోకేష్ చుట్టూనే తిరుగుతుంటారు.. అని మీకూ అనిపిస్తోందా?
కొసమెరుపు: వాస్తవానికి ‘లోకేష్ ఎవరు?’ అంటూ ఆర్నబ్ గోస్వామి వేసిన ప్రశ్నపై ‘సాక్షి’ మీడియాతోపాటు వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా వింగ్ కూడా రచ్చ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ అంశంలో ‘యెల్లో మీడియా’కు చెందిన జర్నలిస్ట్ కమ్ యాంకర్లు ‘సాక్షి’కంటే అడ్వాన్స్ గా ఉన్నారు.

✍ ఎడమ సమ్మిరెడ్డి

