Top 5 This Week

Related Posts

యుద్ధం ఆపిన ట్రంప్!

ఇదీ సంగతి. ఇండియా పాక్ సీజ్ ఫైర్. “నేనే మధ్యవర్తిత్వం వహించా. యుద్ధం ఆపేసా” అని ప్రకటించారు అమెరికా రాజు ట్రంప్. ట్రంప్ మామూలోడు కాదు. కొంచెం కూడా ఓపిక ఉండదు. కాసేపు వదిలితే పాకిస్థాన్ ను ఊడ్చేస్తారని ట్రంపుకు కూడా తెలుసు. అందుకే పెద్ద మామ పాత్ర పోషించాడు. ట్రంపు చెప్పాక ఒక్క డ్రోన్ ఎగిరినా, ఒక్క బాంబు బ్లాస్ట్ అయినా మాములుగా ఉండదు. అణుబాంబులు కురుస్తాయి.

పెద్ద మామ చెప్పాక ఎంత లోపల ఉక్రోషాలు ద్వేషాలు వున్నా అణచి మడచి పెట్టుకోవాల్సిందే. పాక్ మూడు రోజులకే విలవిల్లాడిపోయింది. సందట్లే సడేమియా బెలూచియన్లు బాగుపడ్డారు. వారి రాజ్యాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. పాక్ ల ముందు పాకీల మాదిరిగా బతికిన వీళ్లకు స్వేచ్ఛ లభించింది. పాక్ సైన్యం ఇండియా వైపు ఎక్కుపెడితే, బెలూచి ప్రైవేట్ సైన్యం పాక్ సైన్యాన్ని తరిమికొట్టింది. రేపో మాపో ప్రపంచ పటంలోకి కొత్త దేశం వచ్చి చేరడం ఖాయం. దాని పేరు బెలూచిస్థాన్.

టర్కీని నమ్మకూడదని సిందూరం ద్వారా తెలిసి వచ్చింది. ఈ యుద్ధంలో అది పాకిస్థాన్ వైపు నిలిచింది. డ్రోన్ల సాయం చేసింది. కానీ భారత సైన్యం సెకండ్లలో తిప్పికొట్టింది. తుత్తునియలను చేసింది. పాకిస్థాన్ ఈ యుద్ధాన్ని ఒకసాకుగా చూపించి ఆర్ధికంగా అడుక్కునే ప్రయత్నం చేసింది. ఈ యుద్దాన్ని అడ్డు పెట్టుకుని అప్పుడే ఖజానా నింపుకుంది. ఇక్కడ మన దగ్గర కూడా ఈ యుద్ధం పేరు చెప్పుకుని వ్యాపారస్థులు కొందరు దోపిడీ చేసేశారు. “యుద్ధం పెద్దది అవుతుంది, అన్నీ సిద్ధం చేసుకోండి” అంటూ కొందరు మేధావులు ఇచ్చిన పిలుపుకు చాలామంది ముందస్తు సరుకులు కొనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని సందట్లో సడేమియా వ్యాపారులు రేట్లు పెంచుకున్నారు.

మొత్తానికి యుద్ధం ఆగడం కొందరికి మింగుడు పడటం లేదు. మనవాళ్ళు ఎంత మంది చచ్చినా పరవాలేదు, పాకిస్థాన్ నేల మట్టం కావాలని తెగ శత్రుత్వం చూపించారు. ఇక్కడ ఇండియన్ ముస్లింలపై కూడా ద్వేషం పెంచుకున్నారు. కానీ, ఈ యుద్దంలో ఆర్మీ వింగ్ కు నాయకత్వం వహించింది ఒక ముస్లిం మహిళ సోఫియా అని ఇప్పటికి చాలామందికి తెలియదు. మొత్తానికి ఈ యుద్ధం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన 26 మంది మహిళల సిందూరం చెరిపేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టేసి ప్రతీకారం తీర్చుకున్నాం. 14 ఉగ్రవాద స్థావరాలను నేల మట్టం చేసేసాం. ఇంకా అనేక చోట్ల పాక్ వ్యవస్థలను దెబ్బకొట్టాం. వంద మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం. ఇండియా దెబ్బ చూపించాం.

ట్రంప్ మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ట్రంప్ చేతిలో ఎలాన్ మస్క్ వున్నాడు. వారిద్దరూ తలచుకుంటే ఈ ప్రపంచాన్ని ఏమైనా చేయగలరు.  చైనా లాంటి వాళ్ళు చెలరేగిపోయినా కరోనా లాంటివి వదలగలరేమో గానీ, ఇంకేం చేయలేరు. చూసాంగా పాక్ వదిలినవన్ని తుస్సుమన్నాయి. అవి చైనా దగ్గర కొన్నవే. పాక్ లకు వాటిని వాడటం రాలేదని ఎదురు బాణం విసిరింది చైనా. ఏది ఏమైతేనేం మనం ప్రతీకారం తీర్చుకున్నాం. పాక్ తోక ముడిచేలా చేశాం.  పనిలో పనిగా బీహార్ ఎలక్షన్ కూడా వన్ సైడ్ చేసేసాం. అంతే, ఇక మాటలు లేవు మాటాడుకోవడాలు లేవు. మోదీ కి జై కొడదాం. ట్రంప్ కు థాంక్స్ చెబుదాం. సీజ్ ఫైర్.

– డా. మహ్మద్ రఫీ

Popular Articles