ఖమ్మం: తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని ఏడులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ మున్సిపాలిటీలోని 6 వ వార్డు సింగరేణి కాలనీ వద్ద రూ. 496 లక్షల అంచనా వ్యయంతో 46 అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు, రూ. 250 లక్షల అంచనా వ్యయంతో ప్రకాశ్ నగర్ బ్రిడ్జి నుండి కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోటనారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
అదేవిధంగా పీవిఆర్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపాలిటీ లోని 176 మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం సత్తుపల్లి పట్టణంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తోపాటు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పి. అనిత పలు ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

