ఖమ్మం: సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించిన అంశంపై ఖమ్మం జిల్లా సీపీఎం కమిటీ స్పందించింది. ఈమేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. హత్య జరిగిన ఏడాది అనంతరం పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, మీడియా సమావేశంలో వారి వివరాలను వెల్లడించిన నేపథ్యంలో సీపీఎం జిల్లా కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన దిగువన యథాతథంగా..
‘‘సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సంబంధం లేని నలుగురిని పట్టుకొచ్చి, అసలైన హంతకులను వదిలేస్తున్నారని సిపిఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు, రామారావు భార్య స్వయంగా కొన్ని పేర్లు చెప్పినప్పటికీ వారిని విచారించకుండా వదిలేశారని ఆయన పేర్కొన్నారు. అసలైన హంతకులను రక్షించేందుకే ఈ విధమైన అభూత కల్పనలతో కూడిన క్రైమ్ స్టోరీని రచించి సీపీ తన భుజాన వేసుకున్నారని విమర్శించారు. పోలీసుల తీరుపై ఖమ్మం సీపీ పై తమకు ఎలాంటి నమ్మకం లేదని, అందుకే సిట్ చేత దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని సీపీఎం తరఫున ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. సిట్ దర్యాప్తు జరిపిస్తానని చెప్పిన సీఎం ఆ తర్వాత మాట తప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిట్ చేత ఈ హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఘటనను చూసిన సాక్షులు, రామారావు భార్య చెప్పిన వ్యక్తులను విచారించి అసలైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం నామమాత్రంగా ఎవరినో ఇరికించి, అసలైన వాళ్లను దాటించే ప్రయత్నం చేస్తున్నారని మొదటి నుంచీ తాము చెప్తున్నామని స్పష్టం చేశారు. ఎవరినో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.’’
