Top 5 This Week

Related Posts

జడ్జి కొడుకు హిట్ అండ్ రన్ కేసు: సీపీ బదిలీ, నలుగురి సస్పెన్షన్

(సమీక్ష డెస్క్)
హిట్ అండ్ రన్ ఘటనలో జడ్జి కుమారునిపై నమోదైన కేసులో సక్రమంగా వ్యవహరించలేదనే అభియోగాలపై కేరళంలో ఓ పోలీస్ కమిషనర్ పై బదిలీ వేటు, మరో నలుగురు అధికారులను సస్పెండ్ చేసిన ఉదంతం సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనలో కేసు దర్యాప్తును సరిగ్గా నిర్వహించలేదనే ఆరోపణలపై కొచ్చి పోలీస్ కమిషనర్ కళిరాజ్ మహేష్ పై బదిలీ వేటు పడగా, ఓ సీఐని, స్టేసన్ హౌజ్ ఆఫీసర్ ను, గ్రేడ్ సబ్ ఇన్స్పెక్టర్ ను, అసిస్టెంట్ సివిల్ పోలీస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. కేసు దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని, అందువల్లే పోలీసులపై ఈ చర్య తీసుకున్నామని కేరళం హోం మంత్రి రమేష్ చెన్నితల ప్రకటించారు.

ఒక అదనపు జిల్లా జడ్జి 17 ఏళ్ల కుమారుడి ప్రమేయం ఉన్నట్లు నమోదైన రోడ్డు ప్రమాద కేసు ఇన్వెస్టిగేషన్ ను సరిగ్గా నిర్వహించలేదనే ఆరోపణలపై తీవ్ర వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కొచ్చి పోలీస్ చీఫ్ కళిరాజ్ మహేష్‌ను ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ఆర్. నిశాంతిని నియమించారు. ఈనెల 25వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తడం, జవాబుదారీతనం కోసం డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో కొచ్చి నగర పోలీస్ కమిషనర్‌పై ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఓ జడ్జి మైనర్ కుమారుడు మెర్సిడెస్-బెంజ్ కారు నడుపుతూ స్కూటీని ఢీకొట్టడంతో 55 ఏళ్ల జయబాలకృష్ణన్ అనే వ్యక్తి మరణించాడనేది కేసులోని ప్రధాన అభియోగం. అయితే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరిగిందని బాధిత జయబాలకృష్ణన్ కుటుంబం ఆరోపించింది. ఆ యువకుడు నిత్యం డ్రైవింగ్ చేసేవాడని, అతివేగంగా కారు నడుపుతున్నట్లు చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో చిత్రీకరించేందుకు అర్ధరాత్రి పూట కారును బయటకు తీశాడని పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే జడ్జి తన కుమారుడి ఫోన్ నుంచి ఆ ఫుటేజీని తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు కారు అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు చూపించే ఫుటేజీని కూడా దర్యాప్తు అధికారులు అతని మొబైల్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉంచిన దెబ్బతిన్న మెర్సిడెస్ కారు, వీధిలో ఆహారం అమ్మే వ్యక్తి నడిపిన పూర్తిగా ధ్వంసమైన స్కూటర్‌ను బట్టి, ప్రమాద వేగం చాలా ఎక్కువగా ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన కారు

జడ్జి మైనర్ కుమారుడు నడిపినట్లు పేర్కొంటున్న కారు 2012 మోడల్ టర్బో డీజిల్ కారు, పూర్తిగా ఆటోమేటిక్. కేసును బలహీనపరిచేందుకు ఆ యువకుడి పలుకుబడిగల తండ్రి ప్రయత్నించారని బాధితుడి కుటుంబం ఆరోపించడంతో ఈ కేసు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైంది. దీంతో ఒక సీనియర్ అధికారి ప్రమాద స్థలానికి వెళ్లి, పోలీసు రికార్డులను పరిశీలించారు. బాధితుడి కుటుంబాన్ని కలిసిన తర్వాత నిన్న మరో నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వారిలో ఓ సీఐ, స్టేసన్ హౌజ్ ఆఫీసర్, గ్రేడ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సివిల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఇందుకు బాధ్యులుగా తేలిన అధికారులపై చర్య తీసుకుంటామని హోం మంత్రి రమేష్ చెన్నితల అసెంబ్లీకి హామీ ఇచ్చారు.

ఈ కేసును విచారించిన తీరుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా కారును నడిపి జయబాలకృష్ణన్ మరణానికి కారణమయ్యాడనే అభియోగాలపై జడ్జి మైనర్ కుమారునిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత అతన్ని స్టేషన్ బెయిల్ పై పోలీసులు విడుదల చేశారు. నిందితుడు ఓ జడ్జి కుమారుడు కావడంవల్లే అతన్ని కాపాడేందుకు పోలీసులు కుట్ర పన్నారనేది బాధిత కుటుంబం ఆరోపణ. పలు కారణాలను సాకుగా చూపింంచి కేసులో నిందితుడైన మైనర్ బాలునికి కొన్ని గంటల్లోనే రెండుసార్లు బెయిల్ మంజూరు చేశారని బాధిత కుటుంబం పేర్కొంది.

ఈ పరిణామాల్లో విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో కేరళం అసెంబ్లీలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మరోవైపు మైనర్ అయిన నిందితుడు నేరానికి పాల్పడిన పరిస్థితుల్లో చట్ట ప్రకారం అతని సంరక్షకునిపైగానీ, వాహనం యజమానిపైగానీ కేసు నమోదు చేయాలనే రూల్ ప్రకారం ఈ కేసులో జడ్జిని నిందితునిగా చేర్చేందుకు కేరళం హైకోర్టు అనుమతి ఇచ్చింది.

దీంతో కేసును మరింత పటిష్టం చేస్తూ పోలీసులు కారు యజమాని అయినటువంటి మైనర్ బాలుని తండ్రిని కూడా నిందితునిగా చేర్చారు. గత రాత్రి పోలీస్ టీం జడ్జి నివాసంలో సోదాలు నిర్వహించడానికి ఆయన నివాసానికి వెళ్లింది. బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన ఈ కేసు దర్యాప్తును క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు.

Popular Articles