Top 5 This Week

Related Posts

‘కరెంట్’ ఐఏఎస్ ఆఫీసర్లకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్: విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్‌కో సీఎండీ, సంబంధిత విభాగపు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. విద్యుత్ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని ఆయన అధికారులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవ్ంత్ మాట్లాడుతూ, ‘ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు.

ఈ సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక, పంచాయతీ రాజ్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, హైదరాబాద్ నగర మంచినీటి సరఫరా, భూగర్భ జలాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Popular Articles