ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఏసీ పేలడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురైన మరికొందరు చిన్నారులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికత్స అందిస్తున్నారు.
గత అర్ధరాత్రి సమయంలో రిమ్స్ లోని ఎస్ఎన్సీయూ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో ఏసీ పేలింది. క్షణాల్లోనే పిల్లల వార్డులో దట్టమైన పొగ కమ్ముకుంది. అనూహ్య పరిణామంతో చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది కూడా ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ పరిణామా్లోనే నవజాత శిశువు ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఉదయం మరో ఇద్దరు చిన్నారులు కూడా కన్ను మూశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైనా మరో ఇరవై మందికిపైగా చిన్నారులను ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం రేవంత్ విచారం:
కాగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు.

సీఎం బాధ్యత వహించాలి: కేటీఆర్
ఇదిలా ఉండగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిని ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మిగతా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. పిల్లల వార్డులో కనీస నిర్వహణ లేకపోవడంవల్లే ఈ ఘటన జరిగిందని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 25.00 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

