Top 5 This Week

Related Posts

గవర్నర్ ను కలిసి ఏం చెప్పామంటే..: కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివ్​ప్రతాప్ శుక్లాను బుధవారం కలిసిన తాము మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనపై, శాంతిభద్రతలు, ఇతర అంశాలపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నర్ ను కలిసినట్లు చెప్పారు. వెయ్యి హామీలతో అధికారంలోకి వచ్చి, 1000 రోజుల నుంచి అన్ని రకాల హామీల అమలులో, పరిపాలనలోనూ పూర్తిగా విఫలమైన తీరును గవర్నర్ కు వివరించామన్నారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలో ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో ఆయనకు తెలియజేశామని, రాష్ట్రంలోని రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించామన్నారు.

శాసనసభ సమావేశాల మొదటి రోజు తమపైన ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన దాష్టీకాన్ని గవర్నర్ కు వివరించామన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తీరులోనే, టీ-షర్టుల ద్వారా నిరసన తెలపాలని తాము అనుకున్నామని, తమ హక్కులను కాలరాస్తూ, శాసనసభ్యులమైన మమ్మల్ని సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును గవర్నర్ కు వివరించామన్నారు.

తమపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని ఫోటోలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, తమ మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును వివరించామన్నారు. తమపై దాడి చేసి, తిరిగి తమనే బద్నాం చేస్తున్న కాంగ్రెస్ కుట్రను కూడా వివరించామన్నారు. తమ పార్టీ నాయకులతో పాటు అందరిపైనా దాడి చేయడానికి వెళ్లిన పోలీసులపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోని తీరును గవర్నర్ కు తెలిపామన్నారు.

చివరికి కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిన తీరును వివరించామని, దాంతో పాటు కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లిన విషయాన్ని, హైకోర్టు చెప్పినా శాసనమండలి, శాసనసభలోకి మమ్మల్ని రాకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరును, ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, కోర్టులపై ఎలాంటి గౌరవం లేదని, అందుకే ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేశారని వివరించామని కేటీఆర్ పేర్కొన్నారు.

అదేవిధంగా శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్లుగా ఆపాదిస్తూ, జరగని అవమానాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దళిత స్పీకర్ పేరిట రాజకీయం చేస్తున్నారని, ‘దళిత స్పీకర్’ అంటూ రాజకీయాలు చేస్తున్నారని, మాకు స్పీకర్ పైన అపారమైన గౌరవం ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీనే ఆయనను ‘దళిత స్పీకర్, దళిత స్పీకర్’ అంటూ అవమానించేందుకు చూస్తున్నదని, అందుకే అది శాసనసభ కాదు, కౌరవ సభ అని అంటున్నామని, అది సభ కాదు, దుశ్శాసన సభ అని గవర్నర్ కు తెలియజేసి, మొత్తం పరిస్థితిని వివరించామని కేటీఆర్ చెప్పారు.

తమకు గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు, ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అన్ని ఏఐ ఫోటోలు, వీడియోలపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని, తప్పుడు చిత్రాలు, తప్పుడు ఫిర్యాదులు ఉపయోగించే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో న్యాయం జరగకుంటే, జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెప్పారు. దాడులపై కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు కాలేదని కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Popular Articles