హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై, మరికొందరు నాయకులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న అసెంబ్లీ పరిసరాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై ఈ కేసు నమోదు చేశారు. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం. బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై బీఎన్ఎస్ చట్టంలోని 121(1), 132, 74, 79, 351, 352, 353, r/w 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయా కేసులో వరుసగా నిందితులుగా పేర్కొన్నవారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కేటీఆర్, హరీష్ రావు, డి. సుధీర్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, జి. జగదీశ్వర్ రెడ్డి, శంభీపూర్ రాజు, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్, విజయుడు, తాత మధు, నవీన్ రెడ్డిలతోపాటు పలువురు పార్టీ నాయకులు, అనుబంధీకులు ఉన్నారు. కాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అసభ్య వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఎమ్మెల్సీ తాతా మధును, మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

