భద్రాచలం: తెలంగాణాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధిపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. గోదావరి పుష్కరాల సమయానికి బాసర నుంచి భద్రాచలం వరకు.. కారిడార్ లోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగానే భద్రాద్రి రాములోరి దేవాలయాన్ని కనీ, వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, భద్రాచలం ఆలయ నిర్మాణ పనులు ప్రతీ రోజు పకడ్బందీగా చేయాలని, మూడు షిఫ్టులుగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని 24 గంటలు పని జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 25 శాతం పనులే జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం వహింస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేవాదాయశాఖ పై తమకు ఎంతో నమ్మకం ఉందని, నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా ఆలయ నిర్మాణాలు జరిపించాలని సూచించారు.
అదేవిధంగా ఆలయానికి తీసుకొనే రాళ్ళ నాణ్యత ఖచ్చితంగా ఉండాలని, మేలిమి కలిగిన వాటిని నిర్మాణాలకు ఉపయోగించాలని సంబంధిత నిర్మాణ సిబ్బందికి తెలిపారు. ఎటువంటి అవసరాలు ఉన్న దగ్గర ఉండీ చూసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీ.ఓ రాహుల్ ను మంత్రి ఆదేశించారు.ఆలయ నిర్మాణాలకు ఏ నిర్ణయాలైన తక్షణమే తీసుకోవాలని, వాటి జాబితా ప్రణాళిక ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల అందించాలన్నారు. ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అనుమతి తీసుకొని వాటిని తక్షణమే మంజూరు చేయిస్తానని అధికారులకు మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం, పినపాక, అశ్వాారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో ఆలయ ఈఓ దామోదర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

