Top 5 This Week

Related Posts

ఖమ్మంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్: ఇద్దరి అరెస్ట్

ఖమ్మం: ఖమ్మం నగరంలో తెలంగాణా సైబర్ సెక్యూరిటీ బ్యూరో, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా పది మ్యూల్ ఖాతాలను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. గురు, శుక్రవారాల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలు, అనుమానితి ప్రాంతాల్లో ఏకకాలంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు.

ఈమె కథనం ప్రకారం.. ఖమ్మం సైబర్ నేరాలకు కేంద్రంగా మారకుండా చూసే లక్ష్యంతో మ్యూల్ ఖాతాలు, అనుమానిత ఏటీఎం, చెక్కు విత్ డ్రాయల్స్, అనుమానితి ప్రాంతాలు, ఆర్థిక మార్గాలు, సైబర్ మోసాలకు సహకరించే వ్యక్తులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగింది. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నిర్వహించిన ఈ అపరేషన్ లో బాదిన మురళీకృష్ణ, వడ్లమూడి సాయినివాస్ అనే ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. సైబర్ మోసాల లావాదేవీలకు సహకరించేందుకు ఈ ఇద్దరు 10 మ్యూల్ ఖాతాలను ఇచ్చినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 బ్యాంకు ఖాతాల్లో 121 మ్యూల్ ఖాతాలను, అధిక మొత్తంలో ఏటీఎం విత్ డ్రాయల్స్ కు సంబంధించి 273 ఖాతాలను, రూ. 20,000 వేలకు మించిన చెక్కు విత్ డ్రాయల్స్ లో పాల్గొన్న 12 ఖాతాలను, 25 అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. గుర్తించిన ఆయా ఖాతాలు, ప్రాంతాలకు దేశవ్యాప్తంగా, తెలంగాణాలో అనేక సైబర్ నేరాల కేసులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో విశ్లేషణలో మొత్తం రూ. 7.84 కోట్ల లావాదేవీలు వెల్లడయ్యాయి. వీటిలో రూ. 6.23 కోట్లు వివాదాస్పదమైనవిగా గుర్తించారు.

సీఎస్‌బీ (సైబర్ సెక్యూరిటీ బ్యూరో) గుర్తించిన ఆయా అనుమానితి, ఆర్తిక లావాదేవీలను, పరస్పర సంబంధిత నేరాల విశ్లేషణ ఆధారంగా ప్రత్యేకంగా నిర్వహించిన దాడిలో 40 మంది పోలీసు అధికారులతో కూడిన 11 టీంలు పాల్గొన్నాయి. మ్యూల్ ఖాతాలపై దాడులను తీవ్రతరం చేసి, మొత్తం ఎనిమది పోలీస్ స్టేషన్లలో 25 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లవారీగా ఖమ్మం టూ టౌన్ లో 7, ఖానాపురం హవేలీలో 7, ఖమ్మం వన్ టౌన్ లో 4, ఖమమం టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో రెండు చొప్పున, కారేపల్లి, నేలకొండపల్లి, కామేపల్లి పోలీస్ స్టేషన్లలో ఒక్కొటి చొప్పున ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

ఆ భారీ అపరేషన్ సైబర్ క్రైమ్స్ ఎస్పీ బి. సాయిశ్రీ పర్యవేక్షణలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సమన్వయంతో నిర్వహించారు. సీఎస్‌బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్, సీసీపీఎస్ అధికారి ఫణీందర్, సూర్యాపేట డీఎస్పీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Popular Articles