Top 5 This Week

Related Posts

మరోసారి ఖమ్మంలో సీఎం టూర్

ఖమ్మం: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈనెల 10వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో పాల్గొన్న సీఎం పది రోజుల వ్యవధిలోనే మరోసారి జిల్లా పర్యటనకు వస్తుండడం విశేషం. అనధికార సమాచారం ప్రకారం ఈనెల 20వ తేదీన సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా పర్యటనకు రానున్నారు. వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పోలీసు కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యాక్టరీ ప్రాంగణం, సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు, గోదైజ్ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

సీఎం పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ దివాకర, పక్కన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తదితరులు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, ప్రతి ఏర్పాటును ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైతులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

సభా ప్రాంగణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను శాస్త్రీయంగా రూపొందించాలని, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, మీడియా ప్రతినిధులు, ప్రజల కోసం ప్రత్యేక మార్గాలు, ప్రత్యేక కూర్చునే ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యారికేడింగ్, సూచిక బోర్డులు, తగినంత వెలుతురు, తాగునీటి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు.

అంజనాపురంలో పామాయిల్ ఫ్యాక్టరీ

భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు శాఖకు సూచిస్తూ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా బహుస్థాయి భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు ప్రయాణ మార్గాలను ముందుగానే పూర్తిస్థాయిలో పరిశీలించి, రహదారుల మరమ్మతులు, శుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పూర్తి చేయాలని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసి, ప్రజలకు ముందస్తుగా సమాచారం అందజేయాలని తెలిపారు.

పూర్తయిన పామాయల్ ఫ్యాక్టరీ నిర్మాణం

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంబులెన్సులు, వైద్య బృందాలు, అత్యవసర చికిత్సా కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక శాఖ ఫైర్ టెండర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యుత్ శాఖ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, రవాణా, మున్సిపల్, వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖల అధికారులు, గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Popular Articles