హైదరాబాద్: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ పై పోలీసులు మరో కఠిన సెక్షన్ ను జోడించారు. బీఎన్ఎస్ చట్టంలోని 152 సెక్షన్ ను బాల్క సుమన్ పై అదనంగా మోపారు. ఈమేరకు రిమాండ్ రిపోర్టులో ఈ సెక్షన్ ను జోడించారు. ఈనెల 30వ తేదీన అరెస్ట్ చేసిన బాల్క సుమన్ పై ఎఫ్ఐఆర్ లో తొలుత బీఎన్ఎస్ చట్టంలోని 326(g), 351(3), 353 (1)(b), r/w 55, r/w 61(2)(a), 4 PDPPA సెక్షన్లను పేర్కొన్నారు.

తాజాగా బీఎన్ఎస్ చట్టంలోని 152 సెక్షన్ ను జోడించడం గమనార్హం. దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకు ప్రమాదం కలిగించే చర్యల కింద శిక్షించేందుకు ఈ సెక్షన్ ను చట్టంలో పేర్కొన్నారు. రద్దయిన ఐపీసీ చట్టంలోని సెక్షన్ 124ఏ స్థానంలో ఈ సెక్షన్ వచ్చి వచ్చినట్లు న్యాయవాద వర్గాలు చెప్పాయి. సింగరేణి సంస్థపై, రైలు పట్టాలపై తెలంగాణా భవన్ లో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
