Top 5 This Week

Related Posts

బాల్క సుమన్ అరెస్ట్.. ఇవీ మోపిన అభియోగాలు

హైదరాబాద్: బీఆర్ఎస్ కు చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాల్క సుమన్ ను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణా భవన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సింగరేణి సంస్థకు చెందిన జూనియర్ ఇన్స్పెక్టర్ (ఎస్అండ్ పీసీ విభాగం) ఆనంద్ (58) ఈనెల 26వ తేదీన ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి పోలీసులు బాల్క సుమన్ పై ఎఫ్ఐఆర్ 211/2026 ద్వారా కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టంలోని 326(g), 351(3), 353(1)(b), r/w 55, r/w 61(2)(a) సెక్షన్లు, 4 PDPPA కింద ఈ కేసు నమోదైంది. బాల్క సుమన్ పై ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో పోలీసులు మోపి అభియోగాల వివరాల్లోకి వెడితే..

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉద్రిక్తత, రెచ్చగొట్టే, బెదిరింపు ప్రకటనలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని సింగరేణి భవన్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల సింగరేణి సంస్థ కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా హింసాత్మక చర్యలకు పాల్పడాలని పిలుపునిచ్చారు. అంతేగాక మందమర్రిలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయానికి నిప్పుపెట్టి, ఆ భవనాన్ని ధ్వంసం చేయాలని గుమిగూడిన ప్రజలకు పిలుపునిచ్చారు. నాంపల్లిలోని సింగరేణి భవన్ భవనానికి నిప్పుపెట్టి, దాన్ని కూడా ధ్వంసం చేయాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.

ఈ సమయంలో అటువంటి హింసాత్మక, భయానక కార్యకలాపాలకు మద్ధతు తెలుపుతూ, గుంపులోని కొందరు అటువంటి నేరాలకు పాల్పడేందుకు ఆర్థిక సహాయాన్ని కోరగా, ఎటువంటి పర్యవసానాలు ఎదురైనా సరే ఆర్థిక సహాయం అందిస్తానని బాల్క సుమన్ హామీ ఇచ్చారు. సుమన్ చేసిన ప్రకటనలు హింసను ప్రేరేపించేవిధంగా, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రాణాలకు, ప్రజా ఆస్తులకు ప్రమాదం కలిగించే సామర్థ్యాన్ని సుమన్ చేసిన ప్రకటనలు కలిగి ఉన్నాయి.

ఈ ప్రకటనలు సింగరేణి ఆస్తులను టార్గెట్ గా చేసుకుని, రాష్ట్రంలో హింసకు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రజలను రెచ్చగొట్టే స్పష్టమైన ప్రణాళికగా అర్థమవుతోందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అత్యంత ప్రమాదకరమైనవని, హింసను, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి, ఉద్యోగులను బెదిరించడాన్ని, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రేరేపిస్తాయని అన్నారు.

బాల్క సుమన్ చేసిన ఆయా ప్రకటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించాయని, సింగరేణి ఆస్తులను, ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని హింసాత్మక చర్యలకు, దహనకాండకు పాల్పడేలా సంఘ విద్రోహ శక్తులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయని వివరించారు. అందువల్ల ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వ్యక్తుల ప్రణాళికాబద్దమైన కార్యకలాపాలను అరికట్టకపోతే, అవి తీవ్రమైన శాంతి భద్రతల సమస్యకు దారి తీస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకు, ప్రభుత్వ, ప్రజారంగ ఆస్తులకు ముప్పును కలిగిస్తాయని నివేదించారు.

ఈ నేపథ్యంలో బాల్క సుమన్ పై, అటువంటి నేరాలకు పాల్పడాలని ప్రణాళిక వేసిన ఇతర వ్యక్తులపై చట్టంలోని నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరారని పోలీసులు పేర్కొన్నారు. ఆయా ఆరోపణలకు సంబంధించి ఈనెల 26వ తేదీన హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో బాల్క సుమన్ చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో యథాతథంగా ఉటంకించారు.

కాగా తన అరెస్టుకు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందన్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో తనపై 250 కేసులు పెట్టారని, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సమయంలోనూ తనను జైలుపాలు చేశారని అరోపించారు. గత ఎన్నికలల్లో తాను ఓటమి చెందినప్పటికీ, ప్రజా సమస్యలపై నిత్యం ప్రశ్నిస్తున్నానని, మరోసారి తనను జైలుకు పంపడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించారని, తద్వారా పైశాచికానందం పొందాలని చూస్తున్నారని సుమన్ అన్నారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, చట్టంపై తనకు నమ్మకం ఉందని చెబుతూ.. సత్యమేవ జయతే అని సుమన్ నినదించారు.

Popular Articles