Top 5 This Week

Related Posts

రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

నేలకొండపల్లి: రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలు, రైతుల పక్షపాత ప్రభుత్వంగా, నిరుద్యోగ యువతకు అండదండలుగా, మహిళలకు తోబుట్టువులా ప్రతి ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలని ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ నాచేపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆనాటి పాలకులు వరి వేస్తే ఉరి అనే ఆంక్షలకు భిన్నంగా నేడు సన్న వడ్లకు మద్దతు ధరతో‌ పాటు 500 రూపాయలు క్వింటాల్ కు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. గతం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వెనువెంటనే ఖాతాలలో నిధులు ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న గోదాముల కంటే 200 శాతం అధికంగా నిర్మాణం చేసేందుకు కార్యాచరణ చేపట్టామని, ప్రైవేటు రంగానికి దీటుగా రైతన్నల కోసం ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తుందని త్వరలోనే ఇవి రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు.

అంతకు ముందు వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో..
ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో నగరంలోని 1, 59, 60 డివిజన్లకు చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు రూ. 6.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఖమ్మం నగరంలో పలువురు ఆత్మీయుల మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పాత అగ్రహారంలో ఆళ్ళ వెంకటరెడ్డి, బోనకల్ రోడ్డులో హెడ్ కానిస్టేబుల్ పోలగాని శ్రీనివాసరావు, శ్రీరామ్ హిల్స్‌లో కమర్తపు మురళి తల్లి బతుకమ్మ కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గాదె వాసుదేవరెడ్డి దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించారు.

Popular Articles