Top 5 This Week

Related Posts

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి: సీఎం

ఢిల్లీ: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌) ఏర్పాటు చేయాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కోరారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు క‌లుగుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి కుమార‌స్వామి, ఉక్కు శాఖ స‌హాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్య‌మంత్రి రేవంత్ ఢిల్లీలో శనివారం సమావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్ర‌తిపాద‌నల‌ను కేంద్ర మంత్రుల‌కు రేవంత్ రెడ్డి వివ‌రించారు. తెలంగాణలో పాత వాహ‌నాల‌ స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను కోరుతూ ఆయన ఓ వినతిపత్రం సమర్పించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక‌త‌, భారీ ప‌రిశ్ర‌మ‌లు, పారిశ్రామిక ఉత్ప‌త్తికి ఉన్న అనుకూలత‌లతో దేశ పారిశ్రామిక ఉత్ప‌త్తి లక్ష్యాలకు హైద‌రాబాద్ కేంద్రంగా నిల‌వ‌గ‌ల‌ద‌ని వివరించారు.

హైదరాబాద్ లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని కూడా ముఖ్య‌మంత్రి కోరారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నెట్ జీరో నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఆధునిక పరిశ్రమల‌కు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, కేంద్ర ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు.

Popular Articles