Top 5 This Week

Related Posts

దీపాలి మాదిరిగానే దీదీ పాలనలో.. నాయకుల అధికార సోపానానికి మెట్లుగా..!

ఫైర్ బ్రాండ్ అంటే బెంగాల్ లో గుర్తుకొచ్చేది మమతా బెనర్జీనే. ఫైర్ అనేది పాలిటిక్స్ లో ఆమె బ్రాండ్. మూడున్నర దశాబ్దాల పాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా వుండే బెంగాల్ రాజకీయాలలో రెడ్ టెర్రర్ కు దీదీ బ్రాండ్ యాంటీడోట్ గా అవతరించింది. ముప్పయి నాలుగేళ్లకు ముందు.. 1992లో యాదృచ్ఛికంగా జరిగిన ఓ సంఘటన బెంగాల్ రాజకీయ వేదికపైన మమతాను ఫైర్ బ్రాండ్ గా ఆవిష్కరించింది.

దీపాలి బసక్.. ఓ పేద పిల్ల. మూగది, చెవిటిది కూడా. పొరుగింట్లో వుండే ఒక సీపీఎం కార్యకర్త చేతిలో దీపాలి అత్యాచారానికి గురైంది. అప్పట్లో మమతా పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే మమత రైటర్స్ భవనంలోని ముఖ్యమంత్రి జ్యోతిబసు కార్యాలయానికి బాధితురాలిని తీసుకెళ్లి న్యాయం కోసం బసు అప్పాయింట్మెంట్ కోరింది. నిందితుడిని అరెస్ట్ చేయాలనేది ఆమె డిమాండ్.

ముఖ్యమంత్రి బిజీగా ఉండడం వల్ల కలవడం కుదరదని సీఎం కార్యాలయం చెప్పింది. కాసేపయ్యాక జ్యోతిబసు మమతాను కలవకుండానే తన కార్యాలయం నుంచి వడివడిగా నడుచుకుటూ వెళ్లిపోయారు. ఆలా కాకుండా బసు మమతాను కలిసి, నిందితుడిని అరెస్టు చేయాలనే ఆమె డిమాండ్ ను ఆలకించి ఉంటే దీదీకి అది ఒక డిఫైనింగ్ మొమెంట్ గా మారకుండా ఉండేదేమో!

జ్యోతి బసు (ఫైల్ ఫొటో)

బాధితురాలి మొర కూడా సీఎం ఆలకించలేదనే కోపంతో మమతా ఇన్స్టంట్ జస్టిస్ (సత్వర న్యాయం)కు సిద్దపడి సీఎంవో దగ్గరే బైఠాయించింది. పోలీసులు ఆమెను ఈడ్చుకెళ్లి లాకప్ లో పడేశారు. దీంతో దీదీ ఎర్ర దళాలకు బెస్ట్ బెట్ అనే టాక్ బెంగాల్ అంతటా వ్యాపించింది. అలా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నంత వరకూ తాను రైటర్స్ భవనంలోకి అడుగు పెట్టననే శపథంతో మమతా నిరసన ముగిసింది. పద్దెనిమిదేళ్ల తర్వాత కమ్యూనిస్టుల పాలనకు చరమాంకం పలికి ముఖ్యమంత్రిగా మమత రైటర్స్ భవనంలోకి అడుగు పెట్టింది.

ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగిందా..? అంటే ఇప్పటివరకూ జరిగినట్టు మాత్రం సమాచారం లేదు. గత కమ్యూనిస్టు పాలనలోగాని, తర్వాత అధికారంలోకి వచ్చిన మమతా హయాంలో గానీ నిందితున్ని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నట్టు సమాచారం లేదు. న్యాయం అందకుండానే దీపాలి పాము కాటుకు గురయి ఈ మధ్యనే చనిపోయింది.

దీపాలి మాదిరిగానే దీది పాలనలో మరో యువ లేడీ డాక్టర్ సామూహిక అత్యాచారానికి గురై హత్య గావించబడింది. ఆమెకు కూడా న్యాయం జరిగినట్టు లేదు. అధికార సోపానానికి నాయకులు చేరుకోవడానికి బాధితులు ఒక్కో మెట్టులాగా ఉపయోగపడతారు. దీపాలి, యువ లేడీ డాక్టర్ కూడా ఆలా సమిధలయ్యారు. ఇంకా చాలా మంది అవుతూనే వుంటారు. అంతే!

Popular Articles