హైదరాబాద్: అక్రమ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రం గుట్టును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, గుడి మల్కాపూర్ పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా ఒకరిని అరెస్ట్ చేసి, జనారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న రూ. 12,54,280 విలువైన కల్తీ బేకరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కేడీ కాలనీ పరిధిలో ఈ అక్రమ బేకరీపై పోలీసులు శనివారం జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న అక్రమ బేకరీ పూర్వాపరాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ ఎ. శ్రీనివాసరావు వివరించారు.

నగరంలోని కేడీ కాలనీకి చెందిన అహ్మద్ రజా (46) అనే వ్యక్తి ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన వాతావరణంలో, తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలకు, హోటళ్లకు, కేఫ్‌లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇటువంటి కల్తీ ఉత్పత్తులను వినియోగించడం వల్ల ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు ఈ అక్రమ బేకరీ యూనిట్‌పై దాడి చేసి నిందితుడైన అహ్మద్ రజాను అరెస్ట్ చేశారు. అహ్మద్ రజాపై గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో క్రైం నెం. 110/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 318(4), 274, 275 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఘటనా స్థలం నుంచి రూ. 12.54 లక్షల విలువైన మైదా పిండి (కిచెన్ కింగ్ & సాలాసర్ బ్రాండ్లు) సుమారు 60 బస్తాలు, చక్కెర 30 బస్తాలు, పామాయిల్ 47 బాక్సులు, హిమానీ బేక్ మ్యాజిక్ నెయ్యి 188 బాక్సులు, తయారు చేసిన బిస్కెట్లు (ఓస్మానియా, కాజు, చాయ్, ఫ్యాన్ బిస్కెట్లు), రస్కులు, బటర్ బన్ లు భారీ నిల్వలు, వీటి తయారీకి ఉపయోగించే షుగర్ గ్రైండింగ్, స్పైరల్ మిక్సర్, ఓవెన్ ఎక్విప్మెంట్ వంటి యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ ఏ. శ్రీనివాసరావు వివరించారు.

ఈ ఆపరేషన్ ను గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేష్, గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రామయ్య, ఎస్సైలు కె. వెంకటరమణ, సురేష్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.
ఫొటోలు: అక్రమ బేకరీపై దాడి చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, అరెస్ట్ చేసిన నిందితుడు అహ్మద్ రజా

